ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్టులో తల బొప్పి కట్టింది!

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి తల బొప్పి కట్టే తీర్పు వచ్చింది. కార్యాలయాలకు వేసిన రంగులు పార్టీ రంగులు కాదని ప్రభుత్వం లాయరల్ వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు మొదట వైసిపి పార్టీకి చెందిన మూడు రంగులు వేసినపుడు హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా వాటిని తొలగించాల్సిందేనని ఆదేశించిన విషయం తెల్సిందే. ఆ తరువాత హైకోర్టు తుది తీర్పు తో మళ్ళీ నాలుగో (మట్టి రంగు అంటూ టెర్రకోట రంగు) రంగు అద్దిన వైసిపి ప్రభుత్వానికి తాజాగా సుప్రీం కోర్టు చెంప పెట్టులాంటి తీర్పును ఈ రోజు ఇచ్చింది. 

కొద్ది రోజుల క్రితం హైకోర్టు ధిక్కరణ విషయమై కోర్టుకు హాజరైన సీఎస్, పంచాయత్ రాజ్ ముఖ్య కార్యదర్శి తమకు కోర్టును ధిక్కరించే ఉద్దేశం లేదని సరి చెప్పారు అదే సమయం లో ఈ కేసు పై సుప్రీం కోర్టులో అప్పీల్ చేసినట్లుగా కూడా తెలిపారు. ఐతే ఈ రోజు వచ్చిన తీర్పులో ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలకు వేసిన ఆ నాలుగు రంగులు నాలుగు వారాల్లోగా తొలగించాల్సిందేనని తీర్పు చెప్పింది. మరి ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం కార్యాలయాల రంగులు మారుస్తుందో లేక మరేదైనా మార్గం వెతుకుతుందో వేచి చూడాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ రంగుల కోసం దాదాపు 1500 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. అసలే లోటు బడ్జెట్ తో నడుస్తున్న ఏపీ ప్రభుత్వం రంగుల పేరుతో దుబారా చేయడమేమిటని సామాన్య ప్రజలు మొత్తుకుంటున్నారు.