బీజేపీ గూటికి సూపర్ స్టార్ రజనీకాంత్.. తమిళనాడు సీఎం అభ్యర్థి!!

 

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కమలం వికసించేలా చేయడం మోదీ-షా ద్వయం లక్ష్యంగా పెట్టుకుంది. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ మరింత ఫోకస్ చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలలో కూడా తిరుగులేని పార్టీగా ఎదగాలని చూస్తుంది. దానిలో భాగంగానే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన వ్యూహంతో ముందుకెళ్తుంది. తమిళనాడు విషయానికొస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆకర్షించే పనిలో నిమగ్నమైంది.

నిజానికి రజనీకాంత్ ను ఆకర్షించేందుకు బీజేపీ ఎప్పటి నుంచో యత్నిస్తుంది. అయితే తాజాగా ఆయనకు బీజేపీ చీఫ్ అమిత్ షా బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరితో తమిళనాడు పార్టీ పగ్గాలను అప్పగించడమే కాకుండా.. సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తామని అమిత్ షా రజనీకి హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. రజనీ తమతో చేయి కలిపితే.. తమిళనాట పాగా వేయవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఈ వార్తలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా సరికొత్త మలుపు తిరిగాయి.

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ, అమిత్ షాలను కృష్ణార్జునులుగా రజనీకాంత్ పోల్చిన సంగతి తెలిసిందే. కశ్మీర్ విషయంలో మోదీ, షా ద్వయం తీసుకున్న నిర్ణయాలను రజనీ ప్రశంసలతో ముంచెత్తారు. దీన్ని బట్టి చూస్తుంటే.. బీజేపీ పట్ల రజనీ కూడా సానుకూల ధోరణితో ఉన్నారనే విషయం అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో రజనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu