బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనల్లో నందమూరి సుహాసిని
posted on Sep 21, 2023 12:47PM
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌పై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కానీ స్పందించలేదు. దీంతో తెలుగుదేశం కీలక నేతల దగ్గర నుంచి పార్టీలోని సాధారణ కార్యకర్త వరకు అందరిలోనూ వీరి తీరుపై ఆగ్రహం, అసంతృప్తి,నెలకొని ఉంది.
అలాంటి వేళ.. అదే ఫ్యామిలీకి చెందిన ఓ మహిళ చంద్రబాబుకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడంతోపాటు... చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా.. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగుతున్న తెలుగుదేశం శ్రేణులకు మద్దతుగా నిలిచారు. స్వయంగా ఆందోళన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె నందమూరి సుహాసిని. ఎన్టీఆర్ తనయుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె. దీంతో ఆమెపై పార్టీ నుంచే కాదు ప్రజల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ టీడీపీలో నందమూరి సుహాసిని అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పురోగతి కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి నందమూరి హరికృష్ణ. ఆయన కుమార్తె నందమూరి సుహాసిని సైతం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారంటూ తెలుగుదేశం శ్రేణులు ఆమె పట్ల అభిమానం చాటుతున్నారు.
గత ఎన్నికల్లో అంటే 2018లో నందమూరి సుహాసిని.. కుకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. నాటి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె రాజకీయాలకే కాదు.. తెలుగుదేశం పార్టీకి సైతం దూరం జరుగుతున్నారనే ఓ ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. అయితే అదంతా కేవలం ప్రచారం మాత్రమేనని రుజువు చేస్తూ నాటి నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున.. రాష్ట్రంలో ఏక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా.. ఆ కార్యక్రమంలో సుహాసిని పాల్గొంటూ వస్తున్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తు వస్తున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో.. ఆయన కుమార్తె నందమూరి సుహసిని పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అలాంటి వేళ.. తెలుగుదేశం పార్టీ తరపున ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారడం.. మరోవైపు తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలోనే కాకుండా.. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో సైకిల్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడం.. ఇంకో వైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై పార్టీ అగ్రనాయకత్వం స్పందించకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మహానగరం నేడీ స్థాయిలో ఉండడానికి మూల కారణం చంద్రబాబునాయుడి విజన్, కృషి అనీ, అటువంటి వ్యక్తిని ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేస్తే కేసీఆర్, కేటీఆర్ స్పందించకపోవడమేమిటనీ సామాన్యులు కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది.
ఆ ఆగ్రహం వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా మారే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తెలుగుదేశం గట్టి పోటీ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు. అలాగే నందమూరి సుహాసిన రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసినా విజయం నల్లేరు మీద బండినడకేనని చెబుతున్నారు.