ఆర్టీసీ సమ్మెకు ముగింపు ఉందా ? లేదా ? ఇంకెన్ని రోజులు ఈ మొండిపట్టు

 

ఆర్టీసీ కార్మికులు తల పెట్టిన సమ్మెకు తెరపడనుందా అంటే జవాబు దొరకడం కష్టమేనంటున్నాడు సగటు మనిషి. ఇప్పటికే హైకోర్టులో వివిధ రూపాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి కేసులో విచారణ జరిగింది. తాజాగా ఇవాళ మరోసారి ధర్మాసనం ముందుకు ఆర్టీసి కేసు విచారణకు రానుంది. సమ్మె చట్టబద్ధమని ప్రకటించాలంటూ దాఖలైన పిల్ పై విచారణ చేపట్టనుంది. ప్రైవేటు ఆపరేటర్ల పర్మిట్లు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ సైతం విచారించనుంది హైకోర్ట్.

నిన్నటి నుంచి ఆర్టీసీ కార్మిక జేఏసీ తల పెట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఉద్రిత్తంగా మారింది. దీక్షకు అనుమతి లేదని ఆర్టీసీ జేఏసీ నేతలను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. అశ్వత్థామరెడ్డి ఇంటిలోనే దీక్ష కొనసాగించగా విపక్ష నేతలు ఆయనకు మద్దతు తెలిపారు. ఇక ఇంట్లో దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు కార్మికుల సమ్మె హైకోర్టులో నేడు విచారణకు రానున్న పిటిషన్ లు సహా పలు అంశాలకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం జరగనుంది.

ఇప్పటికే వివిధ పార్టీల మద్దతు కూడా వారికి తెలపడంతో సమ్మెపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. అటు ఉస్మానియాలో అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగించడం పై సమావేశంలో జేఏసీ నేతలు చర్చించే అవకాశం కన్పిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని పార్టీల మద్దతు తెలిపాయన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. కార్మికుల సమ్మె విరమణ ప్రభుత్వం చేతిలో ఉందన్నారు. రేపటి సడక్ బంద్ కు ఆయన మద్దతు ప్రకటించారు.