ఈ స్టార్ బ్యాట్స్ మ్యాన్ ఎవరి తరపున ఆడుతున్నట్లు
posted on Oct 9, 2013 11:29PM
.jpg)
గత రెండు నెలలుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోనే ఉంది. కానీ కాంగ్రెస్ పొమ్మనదు, కిరణ్ వదలడు. ఎవరి కారణాలు, ఆలోచనలు వారికున్నాయి.
తన మాట ఖాతరు చేయకుండా గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రిపై అధిష్టానానికి పీకల దాక కోపం ఉన్నపటికీ, ఇప్పుడు ఆయనని దింపేస్తే సమైక్య ఉద్యమం మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉంటుందనే భయం, ఇప్పటికే తన సమైక్యవాదంతో జనంలో మంచి పాపులారిటి సంపాదించుకొన్న ఆయనకు కొత్తగా సానుభూతి కూడా తోడయితే చేజేతులా మరో బలమయిన ప్రత్యర్ధిని సృష్టించుకోవడమే అవుతుందనే భయం చేత, ఆయనను పదవి నుండి తప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం వెనుకంజ వేస్తోందని చెప్పవచ్చును.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎటూ కాని ఈ సమయంలో చేజేతులా ముఖ్యమంత్రి పదవిని వదులుకొంటే, ఆ తరువాత తను కూడా మిగిలిన సీమాంధ్ర మంత్రుల లాగానే అగమ్యగోచరంగా తిరగాల్సి ఉంటుంది గనుక, అధిష్టానం పొమ్మనే వరకు పదవిలోనే కొనసాగడం మేలనే ఆలోచనతోనే పదవిని అంటిపెట్టుకొని సమైక్యవాదం వినిపిస్తూ తన రేటింగ్ మెరుగుపరుచుకొంటున్నారు.
అదీగాక ఆయన ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న సమైక్యవాదానికి ఒక ప్రత్యేకత, గుర్తింపు, సీమంధ్ర ప్రజల మన్ననలు ఉంటాయి. కానీ అదే పదవికి రాజీనామా చేసి ఎంత గట్టిగా సమైక్యవాదం వినిపించినా ఎవరూ పట్టించుకోక పోవచ్చును.
అదేవిధంగా ఇటువంటి సమయంలో రాజీనామా చేయడం కంటే శాసనసభలో బిల్లు వచ్చినప్పుడు దానిని అడ్డుకొనే ప్రయత్నం చేసిన తరువాత అప్పుడు రాజీనామా చేయడం వలన ప్రజల దృష్టిలో గొప్ప సమైక్యవాదిగా పేరు వస్తే మిగిలిన మంత్రులు, శాసన సభ్యులు గెలిచినా గెలువకపోయినా తాను మాత్రం గెలవడం ఖాయం. ఇక ముఖ్యమంత్రిగా కొనసాగితే యావత్ రాష్ట్ర అధికార యంత్రాంగం తన చెప్పు చేతలలో ఉంటుంది. గనుక తనకు అనుకూలమయిన విధంగా పావులు కదపడం తేలికవుతుంది అనే ఆలోచనా ఉండి ఉండవచ్చును.
అయితే ముఖ్యమంత్రి, అధిష్టానం మధ్య జరుగుతున్న ఈ యుద్ధం అంతా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్ధులను, సీమాంధ్ర ప్రజలను, ఇంకా చెప్పాలంటే తన సీమంధ్ర నాయకులను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ అధిష్టానమే రచించిన ఒక పెద్ద డ్రామాలో భాగమేనా అనే అనుమానాలు కొత్తగా తలెత్తాయి.
ఎందుకంటే, అధిష్టానాన్ని దిక్కరిస్తున్నముఖ్యమంత్రిని పదవిలో నుండి గెంటి వేయడం ఇక తప్పదని అందరూ భావిస్తున్నఈ తరుణంలో, సవరించిన ప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు అంటే బుధవారం ఆమోదించారు. అందులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక సభ్యుడు.
ఒకవేళ ఆయనని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించాలనే ఆలోచనే కాంగ్రెస్ అధిష్టానానికి ఉండి ఉంటే, ఈ కమిటీని ఇటువంటి తరుణంలో ప్రకటించేది కాదు. ప్రకటించినా అందులో ముఖ్యమంత్రికి స్థానం కల్పించేది కాదు. కానీ ఆ రెండు చేసిందంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమంధ్ర ప్రజల తరపున గాక కాంగ్రెస్ అధిష్టానం తరపున “స్టార్ బ్యాట్స్ మ్యాన్” గా ఆట ఆడుతున్నారేమో? అనే ధర్మ సందేహం కలుగుతోంది.