పాపం స్పీకర్ తమ్మినేని.. నిద్రపడితే ఒట్టు!

స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న సెంటిమెంట్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన ఎవరూ కూడా ఆ తరువాతి ఎన్నికలలో విజయం సాధించలేరు. అయితే తమ్మినేనికి ఆ సెంటిమెంట్ బెంగే కాకుండా నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలూ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. స్పీకర్ గా తమ్మినేని వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండటం అటుంచితే.. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో ఆముదాలవలసలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. 

 వైసీపీ సీనియర్ నాయకుడు సువ్వారి  గాంధీ ఇప్పటికే పార్టీ వీడి  ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో సువ్వారి గాంధీ ఆముదాలవలసలో తమ్మినేని విజయం కోసం అంతా తానై పని చేశారు. అందుకు అప్పట్లో జగన్ వచ్చే ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ సువ్వారి గాంధీకి ఇస్తానని ఇచ్చిన హామీయే కారణమని చెబుతారు. అయతే జగన్ ఆ హామీ నిలబెట్టుకోకపోవడంతో సువ్వారి గాంధీ వైసీపీకి రాజీనామా చేశారు. అంతే కాదు ఆయన సోదరుడి సతీమణి  కూడా తన నామినేటెడ్ పోస్టుకు రాజీనామా చేశారు. గాంధీ ఆముదాలవలస నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవనున్నారు. వైసీపీ అధిష్ఠానం అంటే జగన్ తనను మోసం చేశారని గాంధీ ఆరోపిస్తున్నారు.

సువ్వారీ గాంధీ పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతుంటే.. తమ్మినేని సీతారాంకు ఖంగారెందుకు అంటే గాంధీ నియోజకవర్గంలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెుందిన వ్యక్తి. పైగా ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నేత. దీంతోనే తమ్మినేని సీతారాం తన విజయంపై ధీమా కోల్పోయారు. అలాగే వైసీపీలో కూడా ఖంగారు మొదలైంది. దీంతో గాంధీని బుజ్జగించడానికి జగన్ దూతగా వైవీ సుబ్బారెడ్డి శతధా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. 

అదీగాక చాలా కాలంగా సువ్వారి గాంధీ నియోజకవర్గంలో తనదంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమ్మినేని సీతారాం చేపట్టే అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. పార్టీలోనే తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ విషయం పార్టీ అధినేత జగన్ కు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు.  

ఇక ఆముదాలవలస నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయనున్న కూన రవికుమార్ తమ్మినేనికి సమీప బంధువు కూడా కావడంతో దానినే సువ్వారి గాంధీ తన ప్రచారానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.  తమ్మినేతి, కూన రవికుమార్ లు డబుల్ గేమ్ ఆడుతున్నారనీ, వారి రాజకీయ నాటకానికి తెరదించేందుకు తనకు ఓటు వేయాలంటూ ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు. 
అంతే కాకుండా స్థానిక వైసీపీ క్యాడర్ లో కూడా తమ్మినేని పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఆముదాలవలసలో వైసీపీ క్యాడర్ చాలా వరకూ  తమ్మినేనికి మద్దతుగా ఆయన వెంటే నడుస్తున్నారు.  దీంతో తమ్మినేని నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారన్న సెటైర్లు పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి.  మొత్తం మీద ఆముదాలవలస నుంచి తమ్మినేని ఓటమి ఇప్పటికే ఖరారైపోయిందంటూ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.