బాబును ఫినిష్ చేయడానికి కేంద్రం అనుమతి కోరతారట!

తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న జనాదరణ.. వైపీపీ పట్ల వ్యక్తమౌతున్న నిరాదరణతో అధికార పార్టీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యిందా? వారేం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదా? అంటే తమ్మినేని మాటలు వింటే ఎవరైనా ఔననే అంటారు.

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయి ఉండీ నోటికి హద్దూ అదుపూ లేకుండా ఇష్టారీతిగా ఆయన మాట్లాడిన మాటలు కచ్చితంగా నేరపూరితమైనవే. ఒక సామాన్యుడి నోటి నుంచి అటువంటి మాటలు వచ్చి ఉంటే ఈ పాటికి కటకటాల వెనుక ఉండేవాడు. లేదూ విపక్షాల వారెవరైనా అధికార పక్ష నేత గురించి అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖాకీలు ఇళ్లపై దాడి చేసి మరీ జైలు పాలు చేసి ఉండేవారు. కానీ ఇక్కడ మాట్లాడినది రాష్ట్ర స్పీకర్, అందునా స్పీకర్ అయి ఉండీ వైసీపీ కార్యకర్తల సమావేశంలో విపక్ష నేతను ఫినిష్ చేసేస్తామంటూ మాట్లాడటం అరాచకత్వానికి, విశృంఖలతకూ పరాకాష్ట.

అసలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ రూటే సెపరేటు.. ఆయన ఏం మాట్లాడతారో తెలిసే మాట్లాడతారా అన్న అనుమానం వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది. తాజాగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తరువాత ఆయన ఇంకా అరెస్టు కాకుండా ఉన్నారంటే.. అది స్పీకర్ పదవి ఇచ్చిన రక్షణ కవచమైనా అయి ఉండాలి లేకపోతే.. ఏపీ పోలీసులకు వైసీపీ నేతలను అరెస్టు చేసే ధైర్యం లేకపోవడమేనా అయి ఉండాలి. ఇంతకీ ఆయన చంద్రబాబును ఫినిష్ చేస్తానని అన్నారు. ఔను స్పష్టంగా అవే మాటలు మాట్లాడారు. బ్లాక్ కమెండోల రక్షణ లేకుంటే ఆయన ఎప్పుడో ఫినిష్ అయిపోయి ఉండేవారని స్పీకర్ తమ్మినేని అన్నారు.

ఆముదాల వలసలో  వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఔను పార్టీ కార్యకర్తల సమావేశంలోనే స్పీకర్ మాట్లాడారు. బ్లాక్ కమాండోలు ఉన్నారన్న ధైర్యంతో ఆయన రెచ్చిపోతున్నారనీ, ఆ రక్షణ లేకపోతే ఆయన ఎప్పుడో ఫినిష్ అయిపోయేవారనీ తమ్మినేని ఉన్నారు. అలాగే అసలు ఎవరిని ఉద్ధరించడానికి ఆయనకు బ్లాక్ కమాండోల రక్షణ ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు భద్రత ఉపసంహరించాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ హోదాలో తాను కేంద్రాన్ని కోరతానని వైసీపీ కార్యకర్తలకు చెప్పారు. అంటే  చంద్రబాబును ఫినిష్ చేయడానికి కేంద్రాన్ని స్పీకర్ హోదాలో కేంద్రాన్ని అనుమతి కోరుతానని ఆయన అంటున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

 అసెంబ్లీ స్పీకర్, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.  అయినా ఎవరికి జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉండాలో నిర్ణయించాల్సింది ఏపీ అసెంబ్లీ స్పీకర్ కాదన్న విషయం తమ్మినేనికి తెలియదనుకోవాలా? అన్నిటికీ మించి ఇటీవల చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందంటూ ఎన్ఎస్జీ ఉన్నత స్థాయి అధికారులు చంద్రబాబు నివాసం, ఆయన తరచూ వెళ్లే పార్టీ కేంద్ర కార్యాలయంలో భద్రతా ఏర్పాట్లును ఒకటికి రెండు సార్లు సమీక్షించారు. ఆయనకు కమాండోల భద్రతను పెంచారు.

కుప్పం, నందిగామ వంటి చోట్ల వైసీపీ మూకలు ప్రమాదకరంగా ఆయనకు సమీపంలోకి వచ్చి దాడికి  యత్నించారు. వీటన్నిటినీ చూస్తుంటే చంద్రబాబుకు ముప్పు పొంచి ఉన్నది అధికార పార్టీ నుంచేనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.