నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా స్పీకర్‌ కోడెల.!!

 

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ను నర్సరావుపేట లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేయాలనే ఆలోచనలో పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా కోడెలను ఎంపిక చేస్తే.. ఆయన సీనియార్టీతో విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు నమ్మకం. అంతే కాకుండా యూపీఏ ప్రభుత్వం అధికారంలో వస్తే కోడెల సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి ఇప్పించాలని చంద్రబాబు ఆలోచనని సమాచారం. ఇప్పుడున్న ఎంపీల్లో ఎక్కువ మంది వ్యాపారాలు చేసుకుంటున్న వారున్నారు. వారికి మంత్రి పదవి ఇస్తే వారి వ్యాపారాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే కోడెలకు ఇస్తే రాష్ట్రం కోసం కృషి చేస్తారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2014 లోనే కోడెలను నర్సరావుపేట ఎంపీగా పంపుదామని చంద్రబాబు భావించినా.. ఆఖరి నిమిషంలో రాయపాటి టీడీపీలో చేరడంతో ఆయనకు సీటు ఇవ్వాల్సి వచ్చింది. అప్పటి రాజకీయ పరిస్థితి కన్నా ఇప్పటి పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో సీనియర్‌ నేతగా గుర్తింపు ఉన్న కోడెలను ఎంపీగా పోటీ చేయిస్తే మంచిదేనని లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఒకవేళ కోడెల నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే తన కుమారుడ్ని అసెంబ్లీకి పోటీ చేయించాలని కోరవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.