ఉత్తమ్ కి సోనియా గాంధీ ఇచ్చిన సూచనలు ఏమిటి?

 

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి వెళ్లిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, ఢిల్లీలో ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది ఏం జరగబోతోంది అన్న దానిపై పార్టీ క్యాడర్ కూడా కొంత ఆసక్తి తోనే చూస్తోంది. ఢిల్లీ టూర్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల అంశంపై చర్చించారు. ఓటమికి గల కారణాలు సోనియా గాంధీకి వివరించారు ఉత్తమ్. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తా అని మేడమ్ కు చెప్పినట్టు సమాచారం.

సోనియా గాంధీ వద్ద రాజీనామాపై చర్చ జరిగిన సందర్భంగా తొందరపడకుండా ఎదురు చూద్దాం, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని సోనియా గాంధీ చెప్పినట్లు సమాచారం. రాజీనామా అనే అంశంను  వాయిదా వేసుకోమని, ఇప్పుడెందుకు తర్వాత చూద్దాంలే అని సోనియా సూచించారట. ఆమె ఎంత చెప్పినా పార్టీకి కొత్త నాయకత్వం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ అది ఇప్పటికిప్పుడు కాదనేది పార్టీ వర్గాల్లో చర్చ జరగుతోంది. ఉప ఎన్నికల ఫలితాలపై కొంత ఒత్తిడితో ఉన్నారు ఉత్తమ్. ఓ పది రోజుల పాటు బయటకు వెళ్లే ఆలోచనతో ఇదే అంశంపై సోనియా గాంధీ అనుమతి కూడా తీసుకున్నారట. చికిత్స కోసం పది రోజుల పాటు బెంగళూరు వెళుతున్నారని సమాచారం.ఇక ఉత్తమ్ తన తరవాత అడుగులు ఏం వేయాబోతున్నారు అనేది ఆశక్తికరంగా  మారిన అంశం.