మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ల కోసం టీఆర్ఎస్ నేతల వేట...

 

గులాబీ పార్టీ లో జోరు పెరిగి టిక్కెట్ల వేట మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు వారి నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వార్డ్ మెంబర్ నుంచి మేయర్ కుర్చీ దాకా ఎవరి లాబీయింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు బంపర్ మెజార్టీ రావడంతో మునిసిపాలిటీల్లో కూడా గులాబీ జెండాదే హవా అనే అంచనా అందరిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు సమయం ముంచుకొచ్చింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ తో నవంబరు నెలాఖరు కల్లా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. దీంతో గులాబిదళంలో టిక్కెట్ల కోసం వేట మొదలైంది. 

మున్సిపాటీలో వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మొదలు మేయర్ కుర్చీ కోసం ఎదురు చూస్తున్న వారంతా వారి సీనియర్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు షురూ చేశారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపుతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు మొదలైంది. దీంతో మున్సిపాల్టీల్లో కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమనే అంచనాలు పెరిగిపోయాయి. దీంతో పార్టీ టికెట్ దొరికితే చాలు పదవి వచ్చినట్లే అని భావిస్తున్న నేతలంతా పైరవీలు మొదలు పెట్టారు. ఒక్కో వార్డ్ నుంఛి దాదాపు డజను మందికి పైగా టీఆర్ఎస్ స్థానిక నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆశావహులంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతల అనుచరులే కావటంతో వచ్చిన దరఖాస్తులనూ ఫిల్టర్ చేస్తున్నారు. అయితే నూతన మున్సిపల్ యాక్టుపై అవగాహన ఉండి ప్రజల కోసం కష్టపడే వారికి ఖచ్చితంగా అవకాశం వస్తుందని చెబుతున్నారు ఎమ్మెల్యేలు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కౌన్సిలర్ లతో సహా అన్నింటికీ అన్నీ టిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని విశ్వాసముంది. చాలా ఉత్సాహం తో ప్రజలందరూ కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరు కూడా ఎదురు చుస్తునారు. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నాయకుల నియోజక వర్గాల్లో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ పాత నేతలు కొత్త నేతల మధ్య టికెట్ ల కోసం పోటీ పెరిగిపోయింది. టికెట్ దొరికితే చాలు గెలుపు పక్కా అనే ధీమాతో ఉన్నారు. దీంతో తమ నాయకులపై ఒత్తిడి పెంచి ఎలాగైనా టికెట్లనూ దక్కించుకోవాలని భావిస్తున్నారు. అన్ని కోణాల్లో ఆలోచించాకే టికెట్లు దక్కుతాయి అని చెబుతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కొత్తవి పాతవి కలుపుకొని వందకు పైగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే కొత్త మున్సిపల్ చట్టం పై అవగాహన ఉన్నవాళ్లు పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవాళ్లకు మాత్రమే టికెట్లు దక్కుతాయని అధిష్టానం సంకేతాలిస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరికి టికెట్లు దొరుకుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది.