సోనియా ఆటో బయోగ్రఫీ: బిలాంగింగ్.. ఒక ప్రేమ కథలో మాస్కో నీడ.!
Published on: Fri Nov 20, 2026 8:25AM
.webp)
సోనియా గాంధీ రాసిన 544 పేజీల జ్ఞాపకాల పుస్తకం బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ 2026 నవంబర్ 10న మార్కెట్‌లోకి విడుదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి చర్చలకు, భిన్నాభిప్రాయాలకు తెరలేపింది. ఒకవైపు వ్యక్తిగత అనుభవాలు, ప్రేమ కథగా కనిపిస్తున్న ఈ రచన, మరోవైపు అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, చారిత్రక ఘటనలు, అధికార రాజకీయాల కోణంలో భిన్న విశ్లేషణలకు తావిస్తోంది. విడుదలైన తొలి వారంలోనే రెండు లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన ఈ పుస్తకం, సమీక్షలు రాకముందే జాతీయ స్థాయిలో రెండు భిన్న వాదనలకు వేదికగా నిలిచింది. సాధారణ టీవీ చర్చల్లో ఈ గ్రంథాన్ని ఎక్కువగా ఒక వ్యక్తిగత ప్రేమ ప్రయాణంగానే చూపిస్తున్నారు.
1965లో కేంబ్రిడ్జ్‌లోని ఒక భాషా పాఠశాలలో చిన్న ఇటాలియన్ పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి రాజీవ్ గాంధీని కలవడం, కుటుంబాల అభ్యంతరాల నడుమ 1968లో వివాహం జరగడం.. ఆ తర్వాత ఎప్పుడూ ఓటర్లను ఎదుర్కోకుండానే భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఎదగడం వంటి అంశాలు సోనియా బిలాంగింగ్ పుస్తకంలో ప్రముఖంగా కనిపిస్తాయి. అయితే, అదే సమయంలో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అగ్రరాజ్యాల పోటీ, సోవియట్ యూనియన్ ప్రభావం, భారత విదేశాంగ వ్యవహారాల నేపథ్యంలో ఈ పుస్తకాన్ని మరో కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
ఈ కోణంలో మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఆర్ఎస్ఎన్ సింగ్ వంటి విశ్లేషకులు లేవనెత్తిన అంశాలు కీలకంగా నిలుస్తున్నాయి. సోనియా తండ్రి స్టెఫానో మైయానో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ముస్సోలినీ సైన్యంలో సార్జెంట్ మేజర్‌గా ఉండి.. 1943 చివరిలో తూర్పు రణభూమి నుంచి వెనక్కి తగ్గిన నాటి జ్ఞాపకాలు పుస్తకంలో ఉన్నాయి. ఆకలితో ఉన్న రష్యన్ చిన్నారికి దుప్పటి, రొట్టె ముక్క ఇచ్చిన ఘటన.. అనౌష్కా, సోనియా అనే పేర్ల నేపథ్యాన్ని ఆత్మకథ మానవీయ కోణంలో వివరిస్తే.. మైయానో తిరిగి వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంతో అనుబంధం, కుమార్తెలకు రష్యన్ పేర్లు పెట్టడం వంటి అంశాలను వ్యూహాత్మక కోణంలో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రష్యన్, ఫ్రెంచ్, ఆంగ్ల భాషల అభ్యసనం, లెనిన్‌గ్రాడ్ ఇన్‌స్టిట్యూట్ ప్రయత్నం విఫలమైన తర్వాత కేంబ్రిడ్జ్‌లో రాజీవ్‌తో పరిచయం వంటి ఘటనలను ప్రస్తావిస్తున్నారు.
.webp)
అలాగే నెహ్రూ గాంధీ కుటుంబానికి సోవియట్ యూనియన్‌తో ఉన్న చారిత్రక సంబంధాలను కూడా పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. లండన్‌లో పరిచయాలు మొదలైన సమయంలో భారత హైకమిషనర్‌గా ఉన్న పి.ఎన్. హక్సర్‌ను మాస్కో మనిషిగా అభివర్ణిస్తూ, ఆయన 1971 నుంచి 1973 వరకు ఇందిరా గాంధీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 ఇండో సోవియట్ ఒప్పంద రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని పేర్కొంటున్నారు. ఇంగ్లాండ్‌లో భూపేష్ గుప్తా, రజనీ పటేల్, మిన్నూ మసానీ, హక్సర్, జ్యోతి బసు వంటి వారితో కూడిన వర్గాన్ని ఫిరోజ్ గాంధీ పరిచయం చేసిన అంశాలను బట్టి చూస్తే, ఈ పరిచయాలకు రాజకీయ, దౌత్య నేపథ్యం ఉందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇక వరుస ఘటనల కాలక్రమాన్ని పరిశీలిస్తే.. 1975 ఎమర్జెన్సీ సమయంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు అనంతరం రాజీనామా చేయాలని రాజీవ్ సూచించినా ఇందిర సంజయ్ మాట విన్నారంటూ, ప్రజాస్వామ్య అతిక్రమణలకు సంజయ్‌ను బాధ్యుడిగా చిత్రీకరించిన సోనియా తన పుస్తకంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని బాధ్యురాలిని చేయలేదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే 1980లో సంజయ్ విమాన ప్రమాదంలో మరణించిన అనంతరం రాజీవ్ రాజకీయాల్లోకి రావడం, 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్య అనంతరం ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతపై రాజీవ్ అనుమతి ఇచ్చి ఉండరని పుస్తకంలో పేర్కొనడం, సైనిక మోహరింపులో ఆలస్యానికి అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఎ.ఎస్. వైద్య వైపు వేలెత్తి చూపడం వివాదాస్పదంగా మారింది.
ఇది కూడా చదవండి: సోనియా ఆటోబయోగ్రఫీ: కొత్త రికార్డు సృష్టిస్తున్న విక్రయాలు.!
సోనియా పుస్తకంలో ప్రస్తావించిన ఆ విషయాలకు భిన్నంగా, మీరట్ నుంచి బ్రిగేడ్‌ను తరలించి ఐదు వేల మంది సైనికులను అందుబాటులో ఉంచినప్పటికీ, లెఫ్టినెంట్ గవర్నర్, పోలీస్ కమిషనర్ల వల్లే ఆలస్యం జరిగిందని, దాదాపు రెండు వేల ప్రాణాలు కాపాడి ఉండవచ్చని మిశ్రా కమిషన్ నివేదిక స్పష్టం చేసిందని రికార్డులను ఉటంకిస్తున్నారు. పుస్తకంలో ప్రస్తావించిన ఇతర కీలక ఘటనల్లో 1985లో క్రెమ్లిన్‌లో మిఖాయిల్ గోర్బచేవ్‌తో రాజీవ్ భేటీ, రాహుల్, ప్రియాంకలకు రష్యాలో విద్య ప్రతిపాదన, యాల్టా యూత్ క్యాంప్ అనుభవాలు ఉన్నాయి. 1986లో షా బానో కేసు అనంతర చట్టాన్ని సమర్థించడం, ఫిబ్రవరిలో బాబ్రీ మసీదు తాళాలు తెరవడాన్ని అనుమానాస్పద వేగంగా పేర్కొనడం, 1987 బోఫోర్స్, 1989 ఎన్నికల ఓటమి, 1991 శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ హత్య వంటి ఘటనలు ఇందులో చోటుచేసుకున్నాయి.
.webp)
అనంతరం 1998లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు, 1999లో శరద్ పవార్, పి.ఎ. సంగ్మా, తారిఖ్ అన్వర్ విదేశీ మూలాల అంశాన్ని లేవనెత్తినప్పుడు తాను రాజీనామా చేసి తర్వాత కొనసాగిన తీరు, 2004లో ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం, 2005లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ, 2008 అణు ఒప్పందం, 2014 ఓటమి వరకు అనేక మలుపులు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకం ప్రచురణకు ముందు చోటుచేసుకున్న పరిణామాలు కూడా ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఆగస్టు 2026లో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఈ రాతప్రతి నుంచి తప్పుకోవడానికి.. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, మైనారిటీలు, చైనా చొరబాట్లు, పుల్వామా దాడికి సంబంధించిన అంశాలపై విభేదాలే కారణంటూ వార్తలు వచ్చాయి. భేదాభిప్రాయాలంటూ వార్తలు వచ్చాయి. అయితే అందుకు ఆ అంశాలు కారణం కాదని పెంగ్విన్ ఖండించగా, ప్రభుత్వ విమర్శలు పెంగ్విన్ కు అసౌకర్యంగా ఉన్నాయని సోనియా పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో హార్పర్‌కాలిన్స్ బాధ్యతలు తీసుకుని పుస్తకాన్ని 12 వారాల్లో విడుదల చేయగా, నవంబర్ 11న ఒక సమీక్ష 55 వాస్తవిక, సందర్భోచిత లోపాలను ఎత్తిచూపింది. రానున్న రోజుల్లో ఈ పుస్తకంపై చర్చలు కేవలం వ్యక్తిగత జ్ఞాపకాలు, రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, అధికారిక పత్రాలు, కమిషన్ నివేదికలు, దౌత్య రికార్డుల ఆధారంగా జరగాలనే అభిప్రాయం పరిశీలకుల్లో బలంగా వ్యక్తమవుతోంది. చారిత్రక ఘటనలు, విదేశాంగ నిర్ణయాలపై పారదర్శకత, వాస్తవాల నిర్ధారణపై ప్రజలు, విశ్లేషకుల్లో ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చవచ్చు: ఒత్తిడితో ఓకే చెప్పా: ఆ తరువాత నో అన్నా.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ.!
నా తొలి బిడ్డ రాహుల్ గాంధీ కాదు: ఆ బిడ్డకేమయ్యిందో తెలుసా? ఆత్మకథలో వెల్లడించిన సోనియా.!
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[Sonia Gandhi, autobiography, Politicalstir Russia, America, strategies, love story, TeluguOne]


