సోనియా వెతలు తీరేనా!

 

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధి బహిరంగ ప్రదర్శనలకు హాజరు కావడం చాలా అసాధారణం. అలాంటిది నిన్న ‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో ఆమె జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు దిగారు. పార్లమెంటుని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆఖరికి కాసేపు అరెస్టు కూడా అయ్యారు. దేశంలో పేదల బాధలను చూడలేక, రైతుల ఆత్మహత్యలను తట్టుకోలేక తాము ఈ ధర్నాకు దిగామనీ.... ఈ దెబ్బతో అటు బీజేపీకి, ఇటు ఆరెస్సెస్‌కు తమ సత్తా ఏమిటో తెలిసి వస్తుందని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పేర్కొంది. అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలను వ్యతిరేకంగా తమ నిరసనను వినిపించింది. కానీ అగస్టా కుంభకోణంలో కుదేలైపోతున్న తమ అధినాయకత్వాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ఈ హడావుడి చేస్తోందన్న విశ్లేషణలూ వినవస్తున్నాయి.

 

జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొంటూ పోరాటాలు తనకి కొత్తకాదనీ, రక్తం చిందించిన చరిత్ర మనదనీ చెప్పుకొచ్చారు సోనియా గాంధి. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే మున్ముందు అగస్టా కుంభకోణం ఆమెను ముప్పుతిప్పలు పెట్టేట్లే కనిపిస్తోంది. కుంభకోణాలు కాంగ్రెస్‌కు, ఆ మాటకు వస్తే ఏ రాజకీయ పార్టీకైనా కొత్తకాదు. కానీ వాటికి సంబంధించి ప్రతికూల అంశాలు ఉన్నట్లే సానుకూల అంశాలు కూడా ఉంటాయి. ప్రజలు నిదానంగా వాటిని మర్చిపోవడమో, అధికారంలో ఉన్న పార్టీ వివాదాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించడమో జరుగుతూ ఉంటుంది. కానీ అగస్టా వివాదం అలా కనిపించడం లేదు. సాక్షాత్తూ ఇటలీ కోర్టే వేలెత్తి చూపడంతో, ఆనాటి ప్రభుత్వం మీద మచ్చ పడినట్లైంది.

 

సోనియా బద్ధ శత్రువైన సుబ్రమణ్య స్వామిని రాజ్యసభకు పంపడంతోనే బీజేపీ రణతంత్రం ఏమిటో తెలిసిపోయింది. తన వాక్చాతుర్యంతో, దూకుడుతో రాజ్యసభలోకి అడుగుట్టిన రెండోరోజు నుంచే సోనియాను ఇరుకున పెట్టడం మొదలుపెట్టారు స్వామి. అయితే అటు రాజ్యసభలో కానీ, ఇటు లోక్‌సభలో కానీ సోనియాను సమర్థించగల వాక్పటిమ ఎవరికీ లేకపోయింది. జ్యోతిరాదిత్య సింధియా వంటి యువనేత, తమ అధినేత్రిని వెనకేసుకు రావల్సి వచ్చింది. ఒక దశలో కాంగ్రెస్‌కు శత్రు పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ సింధియాకు మద్దతుగా నిలవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టమెంటు పీఠం మీద సోనియాను వెనకేసుకు వచ్చే నాయకులు కరువయ్యారేమో అన్న సందేహం కలగక మానదు.

 

సోనియా కష్టాలు కేవలం అగస్టా కుంభకోణంతో ముగిసేవి కాదు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. తమిళనాడు, పుదుచ్చేరిలలో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న అసోం, కేరళలో పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్లో కూడా చివరి నిమిషంలో ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్‌కు విజయావకాశాలు లేవు. ఈ ఎన్నికల ఫలితాలు కనుక కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వస్తే అవి సోనియాకు శరాఘాతంగా పరిణమించే అవకాశం ఉంది. ఇప్పటికే అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎలాగూ చేజారిపోయింది. ఇక ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక జాతీయ పార్టీకి ఇవేమంత ఘనమైన గణాంకాలుగా తోచడం లేదు.

 

ఇక సోనియాకు కష్టకాలంలో అండగా నిలబడతాడనుకుంటున్న రాహుల్‌ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.  ఇప్పటివరకూ తన వాక్పటిమ గురించి, వ్యూహాత్మక తప్పిదాల గురించి విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్‌ పేరు ఇప్పుడు స్వయంగా అగస్టా కుంభకోణంలో ప్రముఖంగా వినిపించడం మొదలుపెడుతోంది. నిన్న మొన్నటి వరకూ చాటుమాటు విమర్శలకు దిగిన సుబ్రమణ్య స్వామి ఇప్పుడు రాహుల్‌ మీద నేరుగా అస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులోను, బ్రిటిష్‌ పౌరసత్వం వివాదంలోనూ రాహుల్ తీవ్రంగా పోరాడక తప్పని స్థితి! మరి కాంగ్రెస్‌ అంటే సోనియా, సోనియా తరువాత రాహుల్ అన్న భావనలో ఉన్న నేతలు ఇప్పుడేం చేయబోతున్నారు? సోనియాను వెనకేసుకు వచ్చేందుకు కృష్టి చేస్తారా లేకపోతే బలహీనపడుతున్న పార్టీని పునర్మించేందుకు పాటుపడతారా!