పవన్‌ కళ్యాణ్‌ దారేది!

 

ఫిబ్రవరి 2014. తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి విభజిస్తూ పార్లమెంటులో బిల్లుని ఆమోదించేశారు. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, హఠాత్తుగా... పార్లమెంటు తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి మరీ బిల్లుని ఆమోదింపచేయడం ఆంధ్రా ప్రజల మనసుని తీవ్రంగా కలచివేసింది. బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించనీయం అంటూ ప్రతినలు పూనిన నేతల మీద మనసు విరిగిపోయింది. కేవలం రాబోయే ఎన్నికలలో లాభపడేందుకే కాంగ్రెస్‌ ఈ దుందుడుకు చర్యకు పాల్పడిందన్న ఆక్రోశం కలిగింది. ఒకవైపు తెలంగాణలో సంబరాలో జరుగుతుంటే, అదే స్థాయిలో తమ ఆక్రోశాన్ని కూడా వెలిబుచ్చాలని కోరుకున్నారు. అప్పుడు తెరమీదకు వచ్చాడు పవన్‌ కళ్యాణ్‌!

 

2014 మార్చి, 14న పవన్‌ కళ్యాణ్ హైదరాబాదు కన్వెన్షన్‌ సెంటరులో చేసిన ఉపన్యాసం ఓ అద్భుతం. ఒక పక్క సమాజం గురించి మాట్లాడుతూనే మరో పక్క కాంగ్రెస్‌ను దుయ్యపట్టారు. ఒక వైపు భవిష్యత్తు గురించి ప్రస్తావిస్తూనే మరో వైపు తెరాస, ఆంధ్రులను రెచ్చగొడితే, ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. కేంద్రం తీరుతో కడుపు రగిలిపోయి ఉన్న ఆంధ్రా ప్రజలకు పవన్‌ మాటలు ఓ కొత్త బలాన్నిచ్చాయి. తమ తరఫున పోరాటం చేసేందుకు, తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించేందుకు ఓ మనిషి ఉన్నాడన్న ఆశని కల్పించాయి. పవన్‌ కేవలం తన ప్రారంభోపన్యాసంతోనే సరిపెట్టుకోలేదు. ఆ ఉపన్యాసంలో తను ఇచ్చిన ‘కాంగ్రెస్‌ హఠావో, దేశ్‌ బచావో’ పిలుపుని జనంలోకి తీసుకువెళ్లారు. 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా చట్టసభలకు ఎన్నిక కాకపోవడం వెనుక పవన్‌ ఇచ్చిన పిలుపు ప్రభావం కూడా ఉంది. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలైంది!

 

ఎన్నికల సమయంలో అంతగా విరుచుకుపడిన పవన్‌ ఆ తరువాత నిశ్శబ్దంగా మారిపోయారు. ఆంధ్రులకు సంబంధించిన ఏ రాజకీయ పరిణామం ఏర్పడినా, ఆ సమయంలో పవన్‌ ప్రతిస్పందనని ఆశించేవారికి నిరాశే మిగిలింది. పవన్‌ నిర్లిప్తంగా మారిపోయారనీ, ఒకవేళ బయటకు వచ్చి ఎప్పుడన్నా మాట్లాడినా అది కేవలం చంద్రబాబుని కష్టకాలంలో ఆదుకునేందుకే అని ప్రతిపక్షాలు విమర్శించడం మొదలుపెట్టాయి. అలాగని పవన్‌తో తెలుగుదేశం సంతోషంగా ఉందా అంటే అదీ లేదు. ఎన్నికల సమయంలో తెదెపాకి ఓ ఊపునిచ్చిన పవన్‌ రాజధాని శంకుస్థాపన, గ్రేటర్‌ ఎన్నికలు వంటి కీలక సమయాలలో ఆ పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఇక ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్‌ వంటి సమస్యల సందర్భంలోనూ పవన్‌ కచ్చితంగా మాట్లాడలేకపోయారన్న అపవాదు ఎలాగూ ఉంది.

 

కళారంగంలో ఉన్నవారు రాజకీయాలలో కూడా తమ ప్రభను, ప్రతిభను చూపాలనుకోవడం కొత్తేమీ కాదు. అలా సినీరంగం నుంచి వచ్చి రాజకీయాలను ప్రభావితం చేసిన వారి సంఖ్యా తక్కువేమీ కాదు. దక్షిణ భారతదేశంలో సినిమాలు, రాజకీయాలు జోడుగుర్రాలుగా మారి చాలా కాలమే అయిపోయింది. కానీ సినిమాల్లో హిట్ అయినంత మాత్రాన రాజకీయాలలో ఫ్లాప్‌ కాకూడదన్న సూత్రం ఏదీ లేదు. అందుకు మెగాస్టారే ఓ గొప్ప ఉదాహరణగా నిలిచారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌, తన అన్నగారు అందించిన ఉదాహరణను బలపరుస్తున్నారా అన్న సందేహం కలగక మానదు. రాజకీయాల్లో చూపించాల్సిన అపారమైన చాతుర్యం, సహనం లేకపోతే ఎలాంటివారికైనా మనగలగడం కష్టం. దీర్ఘకాలిక లక్ష్యాలు లేకుండా అకస్మాత్తుగా తమకు ఉన్న ప్రజాదరణ అంతా ఓట్ల రూపంలోకి మారిపోతుందనుకుంటే భంగపడక తప్పదు. అన్నింటికీ మించి... ప్రజలు వారి ప్రతి అడుగునూ నిశితంగా గమనిస్తారనీ, వారి ప్రతి మాటనూ ప్రతిపక్షాలు విమర్శిస్తాయనీ మర్చిపోకూడదు. ఏదో ఒకసారి అలా కనపడి వెళ్లడానికి ఇది అతిథి పాత్ర కాదు. ఏదో ఒకసారి ఇలా ఆవేశంగా మాట్లాడి ఊరుకుండి పోవడానికి సినిమా క్లైమాక్సూ కాదు.

 

పవన్‌కు ఈ విషయాలన్నీ తెలియక కాదు. కానీ ఎప్పుడూ తనదైన లోకంలో ఉండిపోయే పవన్‌, నిరంతరం రాజకీయాలలో మనగలిగే చొరవ చూపగలడా అన్నదే ప్రశ్న! ఆవేశానికి మారుపేరైనా అతని వ్యక్తిత్వం రాజకీయాలకు సరిపోతుందా అన్నదే అనుమానం! మరికొద్ది సంవత్సరాలలో తన జీవితాన్ని పూర్తిగా రాజకీయాలకే అంకితం చేస్తానని పవన్‌ అంటున్నారు. నిజానికి ఇది కూడా ఓ ఉద్వేగపూరితమైన ప్రకటనే! సినిమాలు తీయడమా, మానడమా అన్నది తరువాత విషయం. ముందు తనను తాను ఓ క్రియాశీల రాజకీయ నాయకుడిగా పవన్‌ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. తన జనసేన పార్టీ లక్ష్యం ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.

 

ఇప్పటికే జనసేన ఎప్పటి నుంచి ఎన్నికలలో పాల్గొనబోతోందో కూడా తెలియని అయోమయంలో కార్యకర్తలున్నారు. ఆ పార్టీ తెదెపాకి మిత్రపక్షమా, ప్రతిపక్షమా తెలియని సందిగ్థంలో సామాన్యులున్నారు. ఆంధ్రాలో జగన్ ఒంటెద్దుపోకడతో వైకాపా క్రమంగా బలహీనపడుతోంది. ప్రత్యేక హోదా వంటి విషయాలలో బీజేపీ అంటేనే అక్కడి జనాలకి గుర్రుగా ఉంది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను నిర్వహించేందుకు ఎవ్వరూ లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఆ అవకాశం ఉన్నా కూడా జనసేన స్తబ్దుగా ఎందుకు మిగిలిపోతోందన్నదే అందరిలోనూ మెదుల్తున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశలో కానీ, ఆంధ్రప్రదేశ్‌ తరఫున కానీ పోరాడేందుకు ఇప్పుడు సవాలక్ష సమస్యలు సిద్ధంగా ఉన్నాయి. రాజధాని భూముల వివాదం, జలవివాదాలు, పెరుగుతున్న నిరుద్యోగం, కరవు... ఇలా పవన్‌ పోరాడేందుకు చాలా సమస్యలే సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సర్దార్ తన మాటల తూటాలను పొదుపుగా ఎందుకు వాడుతున్నాడన్నది కోటి రూపాయల ప్రశ్న!

 

జనసేన ఏర్పడి ఇప్పటికి రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇంతవరకూ ఆ పార్టీ మీద ప్రజలు ఓ స్థిరాభిప్రాయాన్ని ఏర్పరుచుకోలేకపోయారన్నది వాస్తవం. అందుకే జనసేన తరఫున పవన్‌ కళ్యాణ్ తప్ప మరో నాయకుడు కనిపించడం లేదు. ఆ పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో కాలం వెల్లబుచ్చుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే సాగితే జనసేన మరో ప్రజారాజ్యంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే వ్యక్తిగతంగా పవన్‌కు ఎంత నష్టమో కానీ, తమ కోసం పోరాడే పార్టీ వచ్చిందని మురిసిపోయే సామాన్యుల నమ్మకాన్ని వమ్ము చేసినట్లవుతుంది. అది దేశానికి. ఆ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి ఏమంత మంచిది కాదు కదా!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu