బీజేపీ, జనసేన కూటమికి చిరు సపోర్ట్.. కన్ఫార్మ్ చేసిన సోము వీర్రాజు
posted on Jan 28, 2021 4:54PM
2024 లో జరిగే ఎన్నికలలో బీజేపీ, జనసేన కూటమికి చిరంజీవి మద్దతిస్తారని బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజు ప్రకటించారు. ఆ ఎన్నికలలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా తమకు ఇంకా ఎవరెవరు మద్దతిస్తారో ప్రతిపక్షాలు కూడా చూస్తాయని అయన అన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన కూటమి బలపడుతోందని అయన తెలిపారు. తాము అధికారంలోకి రావాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని సోము వీర్రాజు చెప్పారు.
మరోపక్క జనసేనకు రాజకీయంగా సహకారం అందించడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ‘‘పవన్ కల్యాణ్, నేను చిరంజీవిగారితో కొద్దిరోజుల క్రితం సమావేశమయ్యాం. మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్ కల్యాణ్‌కు చిరంజీవి అపుడు సూచించారు. అలాగే, పవన్ కల్యాణ్ కు రాజకీయంగా తన అండదండలు అందజేస్తానని భరోసా ఇచ్చారు’’ అని తెలిపారు. నిన్న నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు... తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో జనసేన, బీజేపీ కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో చిరంజీవి తిరుపతి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తమ్ముడు పవన్‌కి చిరంజీవి పొలిటికల్ గా తోడుగా ఉండి.. జనసేన, బీజేపీ గెలుపునకు అయన కృషి చేస్తారని జనసైనికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.