ఇంతకీ భవ్యశ్రీ ఎక్కడుందో

 

హైదరాబాద్‌‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ విజయవాడకు చెందిన యువతి భవ్యశ్రీ మిస్సింగ్ కేసులో దర్యాప్తు సస్పెన్స్ సినిమాలా సాగుతోంది. ఆమె మొబైల్ సిగ్నల్ శుక్రవారం వరకు దొరకలేదు. శుక్రవారం సాయంత్రం సిగ్నల్ దొరికింది. ఆ సిగ్నల్స్ ప్రకారం ఆమె తూర్పు గోదావరి జిల్లాలో వున్నట్టు పోలీసులు భావించారు. అయితే ఆ తర్వాత ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ విశాఖపట్టణానికి మారిపోయాయి. సెల్ సిగ్నల్స్ ప్రకారం భవ్యశ్రీ విశాఖపట్నం జిల్లా పాడేరులోని గెస్ట్ హౌస్‌లో వున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడకు వెళ్ళిన పోలీసులకు గెస్ట్ హౌస్ రూమ్‌లో భవ్యశ్రీ కనిపించలేదు. పోలీసులు వెళ్ళిన సమయంలో రూమ్‌లో టీవీ ఆన్ చేసి వుంది. ఆమె మాత్రం కనిపించలేదు. తాము వస్తున్న విషయాన్ని గ్రహించి ఆమె అక్కడ నుంచి మరో చోటికి వెళ్ళిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. తన మిస్సింగ్ గురించి మీడియాలో నిరంతరం కవరేజ్ వస్తూ వుండటంతో వాటిని గమనిస్తూ భవ్యశ్రీ తమకు కనిపించకుండా తప్పించుకుంటోందని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. భవ్యశ్రీ ఇలా ఎందుకు చేస్తోందో కూడా అర్థంకాని విధంగా వుందంటున్నారు. అసలు భవ్యశ్రీ  సెల్ ఫోన్ భవ్యశ్రీ దగ్గరే వుందా.. మరెవరిదగ్గరైనా వుందా, వాళ్ళు ఇలా గేమ్ ఆడుతున్నారా అనే విషయంలో కూడా అంతుబట్టకుండా వుందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ సస్పెన్స్‌కి తెరదించుతామని చెబుతున్నారు.