వైైసీపీ స్వరం మారింది.. ధీమా పోయింది!

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తి అయిన మరునాటి నుంచి వైసీపీ నేతల స్వరం మారిపోయింది. పరోక్షంగా ఓటమిని ఒప్పకుంటూ, వారికి మాత్రమే సాధ్యమైన విధంగా తమ ఓటమికి కారణం తెలుగుదేశం కారణమని చెప్పుకుంటున్నారు. నిన్న మొన్నటి దాకా తమ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు, ఎన్నికల ఉల్లంఘనలను చూసీ చూడనట్ల వదిలేసిన ఎన్నికల సంఘం కూడా చంద్రబాబుతో కుమ్మక్కైపోయారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

పోలింగ్ జరిగిన సోమవారం (మే 13) సాయంత్రం కూడా ప్రభుత్వ సలహాదారు, పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గంభీరంగానే మాట్లాడారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారని ధీమాగా చెప్పారు. వెల్లువెత్తిన ఓటరు చైతన్యం జగన్ సంక్షేమ పాలనకు అనుకూలంగానే ఉందని చెప్పుకున్నారు. సాక్షాత్తూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ సైతం తనకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటేసిన అక్కచెల్లెమ్మలు, అవ్వాతాలకు కృతజ్ణతలు చెప్పారు. కానీ మంగళవారం (మే14) ఉదయానికల్లా వీళ్ల స్వరం మారిపోయింది. ధీమా మాయమైపోయింది. బేలతనం బయటపడిపోయింది. తమ కోసం ఐదేళ్లు ఉద్యోగ ధర్మాన్ని కూడా విస్మరించి సేవలు చేసిన పోలీసులు తెలుగుదేశం కూటమికి కొమ్ము కాశారనీ, తమ కాళ్లూ చేతులూ కట్టేశారంటూ ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టారు.

ఇలా ఆరోపణలు గుప్పించి, తమ ఓటమికి సాకు వెతుక్కోవడంలో వైసీపీ నాయకులు, అభ్యర్థులు ఒకరితో ఒకరు పోటీలు పడ్డారు.  తెలుగుదేశం పెద్ద ఎత్తున రిగ్గింగుకు పాల్పడిందని ఆరోపణలు గుప్పించారు. అధికార పార్టీ ప్రతినిథులుగా తాము ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం లెక్క చేయలేదనీ, పట్టించుకోలేదనీ విమర్శలు గుప్పించారు. మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ అభ్యర్థులు ఇలా వీళ్లూ వాళ్లూ అని లేదు వైసీపీ ముఖ్య నేతలంతా ఎన్నికల సంఘం, పోలీసులు, అధికారులపై విమర్శల పర్వానికి దిగి పరోక్షంగా తమ ఓటమిని అంగీకరించేశారు.

అలా పరోక్షంగా ఓటమిని అంగీకరించిన ప్రముఖుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి, నరసరావు పేట లోక్ సభ అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్, గురజాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, గంగాధర నెల్లూరు వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి ఉన్నారు. తెలుగుదేశం శ్రేణులు తమపై దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు తప్ప నియంత్రించడానికి, ఆపడానికీ వీసమెత్తు ప్రయత్నం చేయలేదని వీరు ఆరోపించారు.  ఇక అనీల్ కుమార్ యాదవ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పోలీసులను, ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మేనేజ్ చేశారని ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశారు.  
ఇక నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా పోలీసులు తెలుగుదేశం పార్టీ తరఫున పని చేశారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

సరిగ్గా  వారీ ఆరోపణలు చేస్తున్న సమయంలోనే గ్రామాలలో వైసీపీ మూకలు తెలుగుదేశం శ్రేణులు, సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారు. మొత్తంగా వైసీపీ నేతలలలో గెలుపు ధీమా పోయి, ఉక్రోషంతో  ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.