బుసలు కొట్టిన పాము.. ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఇంట్లో కలకలం..
posted on Dec 21, 2021 11:39AM
శ్రీకాకుళంలోని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఇల్లు అది. నగరంలోని 89 ఫీట్స్ రోడ్డులో ఉంటుంది ఆయన నివాసం. ఈ ఉదయం ఆ ఇంట్లో ఉన్నట్టుండి కలకలం. ఇంట్లోని వారంతా ఒక్కసారిగా హడల్. పెద్ద పెద్ద అరుపులతో అంతా పరుగులు పెట్టారు. ఇంట్లో వారందరినీ అప్రమత్తం చేశారు. అందుకు కారణం.. బుసలు కొట్టే పాము.
పాము అంటే అల్లాటప్పా పాము కాదు. అత్యంత విషపూరితమైన రక్తపింజర అది. కాటేస్తే ఖతం. అలాంటి పాము ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఇంట్లో చొరబడటం కలకలం రేపింది. పాము బుసలు కొట్టడం చూసి ఇంట్లో వాళ్లంతా భయపడిపోయారు. ఆ పాము ఎటు పోతుందో..? ఎక్కడ నక్కుతుందో..? ఏం ప్రమాదం జరుగుతుందో..? అని అంతా వణికిపోయారు.
కాసేపటికి తేరుకుని.. గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇచ్చారు. హెల్ప్ లైన్ నిర్వాహకులు ఎంపీ ఇంటికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఆ పామును సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.