ధర్మస్థలి మిస్టరీ మరణాలు.. సిట్ గోప్యత ఎందుకు?
posted on Aug 5, 2025 1:28PM

ధర్మస్థలి మరణాల కేసు దర్యాప్తు చేస్తున్న సిట్.. ఈ విషయంలో పాటిస్తున్న గోప్యత.. తవ్వకాలలో బయటపడుతున్న విషయాలను వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు థర్మస్థలితో ప్రతి మరణం ఒక మిస్టరీగానే ఉంది. ఈ మిస్టరీ మరణాలలో పద్మలత కేసు మరో మిస్టరీగా వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి చెందిన కాలేజీలో పద్మలత పీయూసి రెండవ సంవ త్సరం చదువుతున్నది.1986 డిసెంబర్ 22వ తేదీ మాయం అయింది. ఆమె వయస్సు 17 సంవత్సరాలు. ఆమె అదృశ్యం అయిన 56 రోజులు తర్వాత ఆమె శరీరం నేత్రావతీనదీ తీరంలో ఆస్థి పంజరంలా దొరికింది. ఆమె దుస్తులను బట్టి ఆ అస్తిపంజరం పద్మలతదే అని గుర్తించారు. అప్పట్లో ధర్మస్థలిలో పోలీస్ స్టేషన్ లేదు.ఆమె ఆచూకీ లభించినా, అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. పద్మలత తండ్రి దేవానంద్ కమ్యూనిస్టు నాయకుడు. ఆయన కమ్యూనిస్టు పార్టీతో కలిసి చేసిన ఆందోళనతో చివరకు కేసు నమోదు చేసుకున్నారు. దేవానంద్ సమీప స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
పోలీసులు ఆమె మృతదేహం లభ్యమైన తరువాత కూడా సరైన దర్యాప్తు చేయక,ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేసారు. హిందువుల కుటుంబానికి చెందిన పద్మలత శరీరాన్ని సాధారణంగా దహనం చేస్తారు. కాని ఆమె తండ్రి తన కుమార్తె మరణానికి కారకులకు ఎప్పటికైనా శిక్ష పడాలన్న ఉద్దేశంతో ఖననం చేశారు. ఆమె శరీరం అవశేషాలు భవిష్యత్తు లో నిజాలవెలికితీతకు ఉపయోగపడతాయన్న ముందు చూపుతో పద్మలత తండ్రి ఆ పని చేశారు. ఇప్పుడు థర్మస్థలి దురాగతాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాడు పద్మలత మరణానికి కారకులైన వారిని పట్టుకుని చట్టం ముందు నిలిపి శిక్షించాలంటూ అలుపెరుగని పోరాటం చేసిన దేవానంద్ ఇప్పుడు బతికి లేరు. అయితే పద్మలత తల్లి,అక్క,బావా ఉన్నారు. దేవానంద్ కమ్యూనిస్టు నాయకుడు కావడంతో ప్రత్యర్థి రాజకీయవర్గాలు ఆమెను కిడ్నాప్ చేసారని తల్లి ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా పద్మావతి కిడ్నాప్ పై సరైన సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. అత్యాచారంచేసి 56 రోజులు హింసించి ఆమె శరీరాన్ని సమీపంలోని అడవిలో పడేశారని ఆరోపిస్తున్నారు. ధర్మస్థలి అసహజ మరణాల కారకులే పద్మలతనూ హత్య చేసి ఉంటారని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
ఇలా ఒక్క పద్మలత అనే కాదు.. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. పద్మలత లాగే అనన్య భట్, సౌజన్య దారుణ హత్యకు గురయ్యారు. వీరి మరణాల విషయంలో కూడా కనీస సమాచారం లభించలేదు. అనన్య తల్లి సుజాత సీబీఐలో పనిచేస్తున్నా ఏమీ చేయలేకపోయారు. 22 ఏళ్లుగా అనన్య అవశేషాలు దొరికితే సాంప్రదాయ పద్ధతిలో ముక్తి కలిగించాలని ఇమె ఎదురు చూస్తున్నారు. అలాగే థర్మస్థలి మిస్టరీ మరణాల జాబితాలో సౌజన్య విషయం కూడా. అనన్య, సౌజన్యల అసహజ మరణాల విషయంలో సీబీఐ దర్యాప్తు లో సంతోష్ అనే అనామకుడిని నిందితుడని తేల్చారు. కాని రెండేళ్ల కిందట అతను నిర్దోషి గా తేలింది. అనన్య మృతదేహం లభ్యం కాలేదు. సౌజన్య మృతదేహం లభ్యమై, ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారణ అయ్యింది. ఇలాంటి పద్మలతలు, అనన్యలు,సౌజన్య లు ఎంతో మంది ధర్మస్థలి కర్కొకటకుల కాటుకు బలయ్యారు. ఈ మరణాల మిస్టరీ ఛేదించడానికి రంగంలోకి దిగిన సిట్ దర్యాప్తులో భాగంగా జరుపుతున్న తవ్వకాల్లో పుర్రెలు,ఎముకలు దొరికాయన్న వార్తలు వస్తున్నా పోలీసు అధికారులు వాటిని ధృవీకరించడం లేదు.
వందల శవాల పాతిపెట్టానని చెప్పిన పారిశుద్ధ కార్మికుడిని సిట్ బృందంలోని పోలీసు అధికారి బెదిరించాడని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని కూడా ఎవరూ ధృవీకరించడం లేదు. అంతే కాకుండాసిట్ దర్యాప్తులో భాగంగా జరుపుతున్న తవ్వకాలలో బయటపడుతున్న మానవ శరీరాల అవశేషాలకు సంబంధించి ఎటువంటి వార్తా బయటకు పొక్కడం లేదు. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాలకు మీడియాను అనుమతించడం లేదు. దీంతో దర్యాప్తు తీరుపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు పారదర్శకంగా సాగాలనీ, థర్మస్థలి తవ్వకాలలో బయటపడుతున్న వివరాలను వెల్లడించాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.