సారంగ దరియాపై కూలైన కోమలి
posted on Mar 17, 2021 6:49PM
లవ్ స్టోరి చిత్రంలో సారంగ దరియా పాట విషయంలో వివాదం ముగిసింది. ఈ పాట సేకరణ చేసిన జానపద గాయని కోమలి సారంగ దరియా పాటను సినిమాలో ఉపయోగించడంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. దర్శకుడు శేఖర్ కమ్ములను కలిసిన అనంతరం కోమలి ప్రకటన చేసింది.
సారంగ దరియా పాట లవ్ స్టోరి సినిమాలో నాతో పాడించలేదనే బాధ ఇన్ని రోజులు ఉండేదని చెప్పింది కోమలి. అదే ఆరాటాన్ని కొన్ని మీడియాల ద్వారా వ్యక్తం చేశానని తెలిపింది. రేలారె రేలా ద్వారా సారంగ దరియా పాటను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ సురేష్ గారి చొరవతో దర్శకుడు శేఖర్ కమ్ముల కలిశానాని.. తనకు సంతోషంగా ఉందంది. తన రాబోయో సినిమాల్లో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని శేఖర్ కమ్మల మాటిచ్చారని వెల్లడించింది. అలాగే 'లవ్ స్టోరి' సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద 'సారంగ దరియా' పాట నాతోనే పాడిస్తానన్నారని కోమలి తెలిపింది. చాలా సంతోషంగా ఉంది. ఇక సారంగ దరియా పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ప్రకటించింది గాయని కోమలి.
ఇన్ని రోజులు కమ్యునికేషన్ సమస్య వల్ల గాయని కోమలి గారిని కలవలేకపోయానని చెప్పారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆమెకు మాటిచ్చినట్లు భవిష్యత్ లో తన సినిమాలో జానపద పాట పాడించే అవకాశం ఇస్తానన్నారు. సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రామిస్ లను నిలబెట్టుకుంటానని చెప్పారు. కోమలి హ్యాపీగా ఫీలయ్యారు.. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నానని శేఖర్ కమ్మల చెప్పారు.