వైకాపాలో మరో మాయగాడు అరెస్ట్

 

కొన్నినెలల క్రితం తెదేపాను తన ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహంతో ముప్పతిప్పలు పెట్టిన వైకాపాకు ఇటీవల కాలంలో కొత్త రకం సమస్యలు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం రాజమండ్రిలో బ్యాంక్ ఏ.టీ.యం.ను దోచుకొని ఒక హత్యకు కూడా పాల్పడిన వ్యక్తి వైకాపాలో చేరడం ఆ తరువాత అతనిని పోలీసులు అరెస్ట్ చేయడం, వెంటనే అతనిని పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. అది జరిగిన కొద్ది రోజులకే వైజాగ్ కు చెందిన ఒక మహిళ పార్టీలో చేరడం, ఆమెను కూడా పోలీసులు దొంగనోట్ల చలామణీ చేస్తుండగా పట్టుకోవడం, మళ్ళీ ఆమెను కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ అటువంటిదే మరో సంఘటన జరిగింది.

 

నిజామాబాద్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇంఛార్జ్ సిద్దార్దరెడ్డిని ప్రజలకు నకిలీ బంగారం అంటగడుతూ మోసం చేస్తున్న నేరానికి ఈ రోజు (మంగళవారం) పోలీసులు అరెస్ట్ చేసారు. అతను ఆల్వాల్ ప్రాంతంలో ప్రజలకు తక్కువ ధరకే బంగారం విక్రయిస్తున్నట్లు తేలింది. విచారిస్తే అది నకిలీ బంగారమని తేలింది. అతను 1995లో వేరే ఊరులో ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి, పాంచజన్య రికరింగ్ డిపాజిట్ పథకం పేరిట ప్రజల నుండి డబ్బు దండుకొని మాయమయిపోయాడు. మళ్ళీ చాలారోజుల తరువాత ఇప్పుడు వైకాపాలో జేరి కొత్త జీవితం మొదలుపెట్టినప్పటికీ, తన పాత అలవాటులు వదులుకోలేక పోవడంతో ఈసారి పోలీసుల చేత చిక్కాడు.

 

పార్టీ ఇంఛార్జ్ స్థాయిలో ఉన్నవ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇది చాలా అవమానకర సంఘటనగా మిగిలింది. అతనిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వైకాపా ప్రకటించింది. ఇకనయినా అన్ని పార్టీలు కూడా పార్టీలో చేరేవారి పూర్తి వివరాలు తెలుసుకొన్న తరువాతనే సభ్యత్వం ఈయడం మంచిది.