తొలి టెస్టులోనే సెంచరీ, హాఫ్ సెంచరీ.. తొలి భారతీయుడిగా శ్రేయస్ రికార్డ్ 

టెస్టుల్లో టీమిండియా తరఫున ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. ఒకే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శతకం, రెండో ఇన్నింగ్స్ లో అర్ధశతకం సాధించిన మొదటి భారతీయ క్రికెటర్ గా రికార్డు నమోదు చేశాడు. ఇలాంటి ఫీట్ సాధించిన అంతర్జాతీయంగా పదో ఆటగాడిగా శ్రేయర్ అయ్యర్ నిలిచారు. 

న్యూజిలాండ్ తో కాన్పూరులో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 105, రెండో ఇన్నింగ్స్ లో 65 పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్. ఇంతకుముందు 1933-34 సీజన్ లో దిలావర్‌ హుస్సేన్‌ (59, 57), 1970-71 సీజన్ లో విండీస్ మీద సునిల్ గవాస్కర్ (65,67*) లు ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ ల్లో అర్ధశతకాలు సాధించారు. అయితే వీరిద్దరి కన్నా శ్రేయస్ మెరుగ్గా రాణించాడు. కివీస్ తో రెండో ఇన్నింగ్స్ లోనూ శతకం సాధిస్తాడని భావించినా సౌథీ బౌలింగ్ లో బంతి గ్లౌజ్ కు తాకి కీపర్‌ చేతిలో పడింది. దీంతో హాఫ్ సెంచరీతోనే పెవిలియన్ చేరాడు శ్రేయస్ అయ్యర్. 

కాన్పూరు టెస్టులోనే శ్రేయస్ అయ్యర్ మరో రికార్డును కూడా సాధించాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లు కలిపి అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో నిలిచాడు. అయ్యర్ కంటే ముందు వరుసలో శిఖర్‌ ధావన్.  రోహిత్ శర్మ ఉన్నారు.   శిఖర్ ధావన్ తన తొలి టెస్టు మ్యాచ్ లో ఆసీస్ పై తొలి ఇన్నింగ్స్ లో 187 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో అతనికి  బ్యాటింగ్ చేయలేదు. అయినా తొలి మ్యాచ్ లో ఎక్కువ పరుగులు చేసిన భారత క్రికెటర్ గా శిఖర్ నిలిచారు. ఇక రోహిత్ శర్మ  2013-14 సీజన్ లో విండీస్ పై ఆడిన తొలి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 177 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ కు కూడా  బ్యాటింగ్ రాలేదు. శ్రేయస్ అయ్యర్ మాత్రం రెండు ఇన్నింగ్సుల్లోనూ బ్యాటింగ్ చేసి మొత్తం 170 పరుగులు చేశాడు.