ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన సస్పెన్షన్‌ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 

 

గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని క్యాట్ కూడా సమర్థించింది. ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ కొట్టివేసింది. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌ పై హైకోర్టు స్టే ఇచ్చింది.

 

హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఏబీ వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్ ను ఏబీ వెంకటేశ్వరరావుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.