రాజధానిపై కావలసింది చర్చలు, ఆరోపణలు కాదు

 

అధికార తెదేపా నేతలు రాష్ట్ర రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయాలని కోరుకొంటున్న విషయం పెద్ద రహస్యమేమీ కాదు. రాజధాని ఎక్కడ ఏవిధంగా నిర్మించాలనే విషయంపై అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవలసి ఉంటుందని నిపుణుల కమిటీ ఇదివరకే చాలా సార్లు చెప్పినప్పటికీ, అధిచ్చిన నివేదిక వారి అభిప్రాయానికి పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమయిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ అంశంపై మరింత లోతుగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు.ఇది సవ్యమయిన పద్ధతి. కానీ, మాజీ కాంగ్రెస్ నేత రాయపాటి సాంభశివరావు కమిటీ సభ్యులపై, వారిచ్చిన నివేదికపై చేసిన తీవ్ర ఆరోపణలు, రాష్ట్రప్రభుత్వానికే కొత్త సమస్యలు సృష్టించేలా ఉన్నాయి.

 

మారుమూల ప్రాంతమయిన దోనకొండ వద్ద రాజధానిని ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ సభ్యులు అసలు ఆ ప్రాంతాన్ని సందర్శించకుండానే తమ నివేదికను తయారుచేసారని, కమిటీ సభ్యులలో కొందరు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున స్థలాలు కొనుగోలు చేసినందునే అక్కడ రాజధానికి సిఫార్సు చేసారని తీవ్ర ఆరోపణలు చేసారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన శివరామ కృష్ణన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే తన నివేదికను తయారుచేసిందని, దానిని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రభావితం చేసారని ఆయన ఆరోపించారు.

 

కమిటీ ఇచ్చిన నివేదిక ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినమాట వాస్తవం. అయితే అందుకని రాయపాటి సాంభశివరావు కమిటీపై ఈవిధమయిన ఆరోపణలు, విమర్శలు చేయడం అనుచితం. కమిటీ సభ్యులు అసలు దోనకొండకే వెళ్లలేదని చెపుతూనే అక్కడ వారు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసారని చెప్పడం ఏవిధంగా సమంజసం? గత ప్రభుత్వం కమిటీని నియమించింది కనుక కమిటీపై అటు కేంద్రంలోనూ, ఇటు రెండు రాష్ట్రాలలోను అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉందనే ఆయన వాదన అర్ధరహితం. ఇక కొందరికి లబ్ది చేకూర్చేందుకే దోనకొండను రాజధానిగా సూచించారన్న ఆయన కమిటీపై చేసిన ఆరోపణలకు బహుశః ప్రతిపక్షాలు సరయిన సమాధానమే చెప్పవచ్చును.

 

రాజధాని ఎక్కడ ఏవిధంగా నిర్మించాలనేది సాంకేతిక అంశం. అందుకే ఆయా రంగాలలో నిపుణులతో కూడిన కమిటీని వేసారు. అయితే ఈ అంశంపై ప్రజల, ప్రతిపక్షాల అభిప్రాయాలకు విలువ ఈయాల్సి ఉంటుంది కనుక దానిపై లోతుగా చర్చ జరగడం కూడా చాలా అవసరమే. కానీ అందరు ఏకాభిప్రాయానికి రావడమనేది అసంభవం కనుక మెజార్టీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ముందుకు సాగవలసి ఉంటుంది. అంతే కాని కమిటీపై ఈవిధమయిన అర్ధం లేని విమర్శలు, ఆరోపణలు చేయడంవలన సమస్య మరింత జటిలమవుతుంది వేరే ఒరిగేదేమీ ఉండదని గ్రహిస్తే మేలు.

 

ఈ నివేదిక అందగానే రాష్ట్ర ప్రభుత్వం చర్చించుకొని అఖిలపక్ష పార్టీ సమావేశం నిర్వహించి అభిప్రాయాలు పంచుకొనే ప్రయత్నం చేస్తే ఈ సమస్య మరింత ముదరకుండా అడ్డుకట్ట వేయవచ్చును. కానీ సున్నితమయిన ఈ అంశంపై నేతలందరూ ఈవిధంగా రాజకీయాలు చేయడం వలన ఇప్పటికే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. కనుక ఇకనయినా రాజకీయ నేతలందరూ సంయమనం పాటిస్తూ ఈ సమస్యకు విజ్ఞతతో పరిష్కరించే ప్రయత్నం చేయాలని ప్రజల కోరిక.