శిల్పాచౌద‌రి దోచిందంతా బ్లాక్‌మ‌నీనేనా? 50 కోట్లు హ‌వాలా?

సంప‌న్నులే టార్గెట్‌. కోట్లు పోయినా కుర్రోమొర్రో అంటూ అర‌వ‌ని వారే ల‌క్ష్యం. వాళ్ల ముందు తానూ రిచ్‌గా బిల్డ‌ప్ కొడుతుంది. మ‌నం మ‌నం కోటీశ్వ‌రుల‌మంటూ ఫోజులు కొడుతుంది. ముందు క్లోజ్ అవుతుంది. ఆ త‌ర్వాత క‌న్నింగ్‌గా మారుతుంది. క‌ట్‌చేస్తే.. శిల్పాచౌద‌రి మోసాలు పోలీసుల‌కే దిమ్మ‌తిరిగేలా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. పోలీస్ స్టేష‌న్ల‌కు బాధితులు క్యూ క‌డుతున్నారు. తాము 3 కోట్లు ఇచ్చామ‌ని ఒక‌రు ఫిర్యాదు చేస్తే.. మా నుంచి కోటి తీసుకుంద‌ని ఇంకొక‌రు. ఆ త‌ర్వాత మ‌రొక‌రు. ఇలా అంతా కోట్ల‌లోనే లెక్క‌లు చెబుతున్నారు. కంప్లైంట్ రాసివ్వండంటూ పోలీసులు అడిగితే.. బాధితులంతా సైలెంట్‌గా స్టేష‌న్ నుంచి జారుకుంటున్నార‌ని తెలుస్తోంది. కార‌ణం.. శిల్పాచౌద‌రి కొల్ల‌గొట్టిందంటే బ్లాక్‌మ‌నీనే కావ‌డం. ఇచ్చిందంతా బడాబాబులే కావ‌డం. అదంతా లెక్క‌లు లేని న‌ల్ల‌ధ‌న‌మే అవ‌డం.

కోటిన్న‌ర మోస‌పోయిన దివ్యారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో శిల్పాచౌద‌రి ఎపిసోడ్ మొద‌టిసారి వెలుగులోకి వ‌చ్చింది. దివ్యారెడ్డి ఫిర్యాదు తర్వాతే.. శిల్పాచౌదరిపై కేసులు పెరిగాయి. ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. మౌఖికంగా ఫిర్యాదు చేస్తున్నారే తప్ప.. లిఖితపూర్వకంగా కంప్లైంట్‌ ఇవ్వడానికి వెనకంజ వేస్తున్నారు. బ్లాక్‌ మనీ కావడం వల్లే.. వారు శిల్పపై కేసుకు సిద్ధపడడం లేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఓ బడా సినీ నిర్మాత కుమార్తె కూడా శిల్పాచౌదరికి రూ. 3 కోట్లు ఇచ్చి మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. 

మ‌రి, కొల్ల‌గొట్టిన సొమ్మంతా ఏం చేసిన‌ట్టు? ఓ ల‌గ్జ‌రీ విల్లా కొన్న‌ట్టు.. హవాలా మార్గంలో రూ. 50 కోట్లు విదేశాలకు మళ్లించినట్టు ద‌ర్యాప్తులో తేలుతోంది. అంత పెద్ద మొత్తంలో విదేశాల్లో ఎవ‌రికి పంపారు? ఆ న‌గ‌దంతా అక్క‌డే ఉందా?  తిరిగి మ‌రో రూపంలో ఇండియాకు తిరిగొచ్చిందా? అనే కోణంలోనూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అవ‌స‌ర‌మైతే ఈడీ సాయం తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. శిల్ప దంపతుల మొబైల్‌ ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు త‌దుప‌ర‌ దర్యాప్తు చేస్తున్నారు.