ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం.. సిరివెన్నెల‌నే సాక్షం..

చెంబోలు సీతారామ‌శాస్త్రి. అలియాస్ సిరివెన్న‌ల సీతారామ‌శాస్త్రి. సినీ సాహిత్యంలో మేరుప‌ర్వ‌తం. అక్ష‌రాల‌ను శిల్పాలుగా అందంగా పేర్చేవారు. ప‌దాల‌తో విస్పోటాలు సృష్టించేవారు. సిగ్గులేని స‌మాజాన్ని నిగ్గ‌దీసి అడిగేవారు. అర్థ శ‌తాబ్ద‌పు అజ్ఞానాన్ని నిప్పుల‌తో క‌డిగేవారు. జ‌గ‌మంత కుటుంబంలో ఏకాకి జీవితాన్ని చూపించేవారు. విధాత త‌ల‌పున జీవ‌న వేదాన్ని వినిపించేవారు. అర్థ‌రాత్రి-అప‌రాత్రి తేడా లేకుండా సాహిత్య మ‌ధ‌నం చేసేవారు. అక్ష‌రాల‌తో పోరాటంలో గెలిచేవారు..ఓడేవారు..న‌లిగేవారు. ఆ ఒత్తిడిని త‌ట్టుకోలేకో, లేక అల‌వాటో తెలీదు కానీ.. ధూమ‌పానాన్ని ఆశ్ర‌యించారు సీతారామ‌శాస్త్రి. 

అద్భుత సినీ సాహితీవేత్త సిరివెన్నెల ఓ చైన్ స్మోక‌ర్‌. స‌మాజంలోని కుళ్లును క‌డిగేసేవారు కానీ, త‌న‌కున్న చెడు అల‌వాటును మాత్రం అస్స‌లు వ‌దిలించుకోలేక‌పోయారు. సిగ‌రేట్ల మీద సిగ‌రేట్లు కాల్చేవారు. బ‌హుషా ఆయ‌న పొగ త్రాగుతూ రిలాక్స్ అయ్యేవారేమో. చిన్న వ‌య‌సులోనే సినీ ప‌రిశ్ర‌మ‌కు రావ‌డం.. అలా అలా సిగ‌రెట్ అల‌వాటు కావ‌డం.. ఆ అల‌వాటు కూడా ఆయ‌న కెరీర్‌తో పాటే ఎద‌గ‌డం.. ఆ త‌ర్వాత వ్య‌స‌నంగా మార‌డంతో.. ఇంకా ఎంతో ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉన్నా.. 66 ఏళ్ల‌లోనే కాలం చేశారు సీతారామ‌శాస్త్రి.

సిగ‌రెట్ వ్య‌స‌నం వ‌ల్లే.. ఆయ‌న రెండు ఊపిరితిత్తులు పాడ‌య్యాయ‌. గ‌తంలోనే ఓ ఊపిరితిత్తును స‌ర్జ‌రీ చేసి స‌గం వ‌ర‌కూ తీసేశారు వైద్యులు. ఇటీవ‌ల రెండో ఊపిరితిత్తుకు సైతం ఇన్ఫెక్ష‌న్ రావ‌డంతో అది కూడా స‌గం తొల‌గించారు. ఆ త‌ర్వాత హార్ట్‌ ప్రాబ్ల‌మ్ కూడా వ‌చ్చింది. చివ‌ర‌కు ఇలా సినీలోకాన్ని.. మ‌న లోకాన్ని.. జ‌గ‌మంత కుటుంబాన్ని అర్థాంత‌రంగా విడిచి.. అనంత‌తీరాల‌కు ప‌య‌న‌మ‌య్యారు. విధాతలో విలీన‌మ‌య్యారు. స్వ‌ర్గలోకాన్ని త‌న మ‌రో సాహితీ లోకంగా మార్చుకునేందుకు మ‌న నుంచి దూర‌మ‌య్యారు. సిరివెన్నెల మ‌ర‌ణంతో ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అని మ‌రోసారి గుర్తు చేసుకుందాం. ఆ చెడు అల‌వాటుకు దూరంగా ఉందాం. ధూమ‌పానంతో కాకుండా.. అంత‌కంటే ఎక్కువ ద‌మ్ము ఇచ్చే.. మ‌త్తెక్కించే.. సీతారామ‌శాస్త్రి పాట‌ల‌తో సేద‌తీరుదాం..ఎంజాయ్ చేద్దాం.