బంగ్లాలో మళ్లీ అశాంతి: షేక్ ఘర్ వాపసీ ప్రకటనే కారణమా.?
Published on: Thu Nov 12, 2026 11:48AM

బంగ్లాదేశ్ లో ప్రశాంతత భగ్నం కానుందా? దేశంలో గతంలో జరిగిన చారిత్రాత్మక జెన్ జీ ఉద్యమం కారణంగా పదవి నుంచి వైదొలిగి, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా తాజాగా బంగ్లాదేశ్ లో అడుగుపెడతానని ప్రకటించడం ఆ దేశ రాజకీయ వర్గాల్లో పెను సంచలన సృష్టించింది. ఆమె రాక ప్రకటనతో బంగ్లాదేశ్ రాజకీయాలు మరో సారి వేడెక్కాయి.
భారతదేశంలో ప్రవాస జీవితం గడుపుతున్న 79 ఏళ్ల షేక్ హసీనా, త్వరలోనే బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే, ఆమె పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డును గతంలో అధికారంలోకి వచ్చిన తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేయడంతో, ఆమె కొత్త పాస్‌పోర్ట్ జారీ చేయాలని న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాన్ని అభ్యర్థించారు. రాబోయే డిసెంబర్‌లో ఎలాగైనా స్వదేశానికి చేరుకుని, న్యాయస్థానం ముందు స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆమె భావిస్తున్నారు.
మరోవైపు, షేక్ హసీనా దేశానికి తిరిగి రానున్నారన్న వార్త బంగ్లాదేశ్‌లో దుమారం రేపుతోంది. ఆమె పాలనా కాలంలో జరిగిన అణచివేత సంఘటనలు, విద్యార్థి ఉద్యమ సమయంలో జరిగిన హింసాకాండకు సంబంధించి ఆమెపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుత ప్రభుత్వం ఆమె రాకను వ్యతిరేకిస్తోంది. హసీనా తిరిగి వస్తే దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, ఆమె మద్దతుదారులు మళ్లీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: నన్ను చంపినా సరే బంగ్లాదేశ్‌కు వెళ్తా..షేక్ హసీనా సంచలన ప్రకటన..!
గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, రాజకీయ పరివర్తన దశను ఎదుర్కొంటోంది. జెన్ జీ విప్లవం ద్వారా దేశంలో అధికార మార్పిడి జరిగి, కొత్త ప్రభుత్వం కొలువైనప్పటికీ, షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో నిషేధించడం వంటి పరిణామాలు సంభవించాయి. ఈ తరుణంలో హసీనా స్వదేశంలో అడుగుపెడతానన్న ప్రకటన ఇటు ప్రభుత్వానికి, అటు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు పెద్ద సవాలుగా పరిణమించింది.

షేక్ హసీనా రాకకు సంబంధించి బంగ్లాదేశ్, ఇండియా మధ్య దౌత్యపరమైన చర్చలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. హసీనాను తమకు అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దౌత్య మార్గాల ద్వారా భారత్‌ను కోరిన నేపథ్యంలో, ఆమె స్వదేశానికి వెళ్లే పరిణామాలు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో షేక్ హసీనా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మీకు నచ్చవచ్చు: బంగ్లాదేశ్ సంక్షోభం: ఇండియాలో రాజకీయ ఆరోపణలు.. వాస్తవాలు, అతిశయోక్తులు.!
మళ్లీ కోవిడ్ కలకలం: ప్రపంచాన్ని కమ్మేస్తున్న కొత్త వేరియెంట్.. ప్రమాదమెంత.?
[Sheikh Hasina, Bangladesh, Politicalinstability, GenZ, TeluguOne]


