పాదయాత్ర తరువాత షర్మిల పార్టీకి సారధ్యం చేస్తారా

 

గత అక్టోబరు నుండి సాగుతున్న షర్మిల పాదయాత్ర ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టడంతో ఆఖరి దశకు చేరుకొంది. ఆమె ఈరోజు సాయంత్రం రావివలస నుండి శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెట్టారు. ఆమె తన పాదయాత్రను ఆగస్ట్ మొదటివారంలో ఇచ్చాపురంలో ముగించి ఒక భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

 

షర్మిల తన పాదయాత్రను ముగించుకొని వచ్చిన తరువాత ఆమె తల్లి విజయమ్మ నుండి పార్టీ బాధ్యతలు స్వీకరించి ముందుగా పార్టీని చక్కదిద్దే పని మొదలు పెట్టవచ్చును. ఇంతకాలం విజయమ్మ తన శక్తికి మించిన పనే అయినప్పటికీ, పార్టీ పరిస్థితుల దృష్ట్యా శ్రమించక తప్పట్లేదు. అందువల్ల షర్మిల వెంటనే పార్టీ బాధ్యతలు వెంటనే చెప్పట్టవచ్చును. అయితే వెంటనే ఆమె రెండు అగ్ని పరీక్షలు ఎదుర్కొని తన సత్తా చాటుకోవలసి ఉంటుంది. పంచాయితీ ఎన్నికల తరువాత వచ్చే జలసంఘం, మునిసిపల్ ఎన్నికలలో ఆమె వైకాపాను విజయపధంలో నడిపించగలిగితే, అది ఆమెకు మనోధైర్యం కలిగించడమే కాక, పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు దోహదపడుతుంది. ఆ తరువాత వివిధ జిల్లాలో పార్టీ నేతల మధ్య రగులుతున్న విబేధాలను పరిష్కరించి, పార్టీకి నష్టం కలిగిస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించవచ్చును.

 

అయితే, వీటన్నిటికంటే ముందుగా పార్టీలో తన స్థానం ఏమిటో ఆమె ఖరారు చేసుకోవలసి ఉంటుంది. పార్టీ వ్యవహారాలు చక్కబెట్టాలంటే ముందుగా ఆమె పార్టీలో తన స్థాయికి తగ్గ పదవి చెప్పటక తప్పదు. కానీ సెప్టెంబర్ నెలలో జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ బెయిలుకి దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది గనుక, అంతవరకు ఆమెకు తాత్కాలికంగా ఏవయినా సభలు, దీక్షలు వంటివి నిర్దేశించే అవకాశం ఉంది. ఒకవేళ అప్పుడు కూడా ఆయనకి బెయిలు దొరకని పక్షంలో, మీడియాలో వస్తున్నట్లు వారి కుటుంబంలో ఆదిపత్యపోరు లేకపోయినట్లయితే, షర్మిలకు పార్టీలో తగిన హోదా కల్పించి పార్టీ బాధ్యతలు అప్పగించడం ఖాయం. అదే జరిగితే, ఆమె రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం ప్రారంభమవుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu