ఆమె హృదయం సంచిలో ఉంది..

లబ్ డబ్ శబ్దం వింటూ జీవితాన్ని లయబద్ధంగా కొనసాగిస్తాం. మరి ఆ శబ్దం ఆగిపోతే... జీవితం ఆగిపోతుందా.. ఆగిపోదు అని నిరూపిస్తున్నారు సెల్వా హుస్సేన్. 39 ఏళ్ల సెల్వా శరీరం లోపల గుండె లేకపోయినా గుండెధైర్యంతో జీవితాన్ని కొనసాగించవచ్చని కృత్రిమ గుండెను బ్యాగ్ లో మోస్తూ చిరునవ్వుతో ఎందరికో స్ఫూర్తి నిస్తున్నారు. ఆమె ప్రపంచంలోనే కృత్రిమ గుండెతో జీవిస్తున్న రెండవ మహిళ సెల్వా( మొదటి మహిళ కాథ్లీన్ షోర్స్ ) బ్రిటన్ రాజధాని లండన్ లోని ఇల్ఫోర్డ్ లో నివసించే సాధారణ మహిళ సెల్వా హుస్పేన్. భర్త, ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలో పెనుతుఫాన్. చిన్నపాపాయికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడు ఆమె అనారోగ్యం బారిన పడ్డారు. ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. ఫ్యామిలీ డాక్టర్ ను కలవడానికి ఇంటి నుంచి కాస్త దూరం నడిచారు. అంతే అడుగు ముందుకు పడలేదు. వెంటనే లండన్‌లోని హేర్‌ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి హార్ట్ లో సమస్య ఉందని వెంటనే మరో గుండెను అమర్చాలని చెప్పారు. ఆమె ప్రాణాలు నిలబడాలంటే మరో గుండె కావల్సిందే. అయితే గుండె దాతల కోసం అప్పటికే వందలాది మంది ఎదురుచూస్తున్నారు. సెల్వా పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. మరో గుండె అనేది సాధ్యమయ్యే విషయంగా కనిపించలేదు. దాంతో కృత్రిమ గుండె అమర్చడానికి డాక్టర్ల బృందం సిద్ధపడింది. 27 జూన్ 2017న హేర్ ఫీల్డ్ సర్జరీ డిపార్ట్ మెంట్ హెడ్ ఆండ్రీ సైమన్, సర్జన్ డయానా గార్సియా సాజ్ ఆధ్వర్యంలో ఆరుగంటల పాటు జరిగిన ఆపరేషన్ లో ఆమె గుండెను తొలగించారు. దాని స్ఠానంలో కృత్రిమ గుండె కవాటాలను ఇంప్లాట్ చేశారు. దానిని పని చేయించే యంత్రాంగాన్ని శరీరం వెలుపల ఏర్పాటు చేశారు.

 

ఆపరేషన్ తర్వాత నెలరోజుల పాటు సెల్వా ఆసుపత్రిలోనే ఉన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో నడవడం, మాట్లాడటం, తినడం, తాగటం, కండరాల బలాన్ని పెంపొందించుకోవడం తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. పుట్టుకతో తన శరీరంలో ఉన్న గుండెను ఆసుపత్రిలో వదిలేసి కృత్రిమ గుండెతో ఇంటిదారి పట్టారు. ఆ తర్వాత  భర్త, పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నారు. ఆమె గుండె స్థానంలో ఏర్పాటుచేసిన కృత్రిమ గుండె  నిమిషానికి 138 సార్లు కొట్టుకుంటుంది. ఈ హృదయ స్పందనలతో శరీరమంతా రక్త ప్రసరణ జరుగుతుంది. సెల్వాను సజీవంగా ఉంచుతుంది. ఈ గుండెను పనిచేయించే పరికరాన్ని మాత్రం ఎప్పుడు ఆమెతో ఉండేలా బ్యాగ్ లో అమర్చారు.  6.8 కిలోల బరువున్న ఈ బ్యాగ్ ను ఆమె అనుక్షణం తనతో ఉంచుకోవాల్సిందే. ఇందులోని పరికరం రెండు బ్యాటరీలతో ఉంటుంది, ఇది ఎలక్ట్రిక్ మోటారు , పంపు ద్వారా ఆమె శరీరంలో రక్త ప్రసరణ కోసం ఛాతీలోని ప్లాస్టిక్ సంచిలోకి జతచేయబడిన గొట్టాల ద్వారా గాలిని నెట్టివేస్తాయి. ఇందులో బ్యాటరీ ఆగిపోతే కేవలం నిమిషంన్నరలోనే తిరిగి బ్యాటరీ అమర్చాలి. లేకపోతే ఆమె శరీరంలో రక్తప్రసరణ ఆగిపోతుంది. ఆమెతో పాటు భర్త ఉంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాడు.

 

జీవితంలో చిన్నచిన్న సమస్యలకే మనం బాధపడిపోతాం. కానీ, శరీరంలో ఎంతో కీలకమైన గుండె లేకపోయినా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. తన ప్రాణాలను కాపాడే కృత్రిమ గుండెను భుజానికి తగిలించుకుని  చిరునవ్వుతో జీవిస్తున్న సెల్వాకు హాట్సాఫ్..