రష్యా విమానాన్ని మేమే కూల్చేసాము..ఇదిగో వీడియో: ఐసిస్ ఉగ్రవాదులు

 

రష్యా విమానాన్ని తామే క్షిపణితో కూల్చివేశామని ఐసిస్ ఉగ్రవాదులు ప్రకటించుకొన్నారు. దానిని వీడియో తీసి ఇంటర్నెట్ లో కూడా పెట్టారు. సిరియాలో తమ స్థావరాలపై రష్యా విమానిక దాడులు చేస్తున్నందునే ప్రతీకారంగా విమానాన్ని కూల్చివేశామని ఉగ్రవాదులు పేర్కొన్నారు. నిన్న ఈజిప్టులో కూలిపోయిన రష్యా విమానంలో 224 ప్రయాణికులు, 7 మంది విమాన సిబ్బందితో కలిపి మొత్తం 231మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా విమానాన్ని తామే కూల్చివేశామని ఐసిస్ ఉగ్రవాదులు ప్రకటించినప్పటికీ ఈజిప్ట్, రష్యా దేశాలు దానిని దృవీకరించలేదు.

 

సాధారణంగా క్షిపణులతో 26,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానాలను కూల్చవచ్చును. కానీ రష్యా విమానం గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధం తెగిపోయే సమయానికి సుమారు 31,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. అంటే క్షిపణులకు అందనంత ఎత్తులో ప్రయాణిస్తోందన్నమాట. కనుక ఏదయినా యాంత్రిక లోపం వలన కానీ మానవ తప్పిదం వలన కానీ లేదా ఐసిస్ ఉగ్రవాదులు విమానంలో ముందుగానే బాంబులు అమర్చి పేల్చడం వలన గానీ కూలిపోయుండవచ్చని ఇరు దేశాల అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొన్న రష్యా అధికారులు విమానంలోని బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకొన్నారు. కాక్ పిట్ లో పైలట్ల సీట్ల క్రింద అమర్చి ఉంచే ఆ బ్లాక్ బాక్స్ లో పైలట్ల సంభాషణ నిరంతరంగా రికార్డు అవుతుంది. కనుక దాని ద్వారా విమానం కూలిపోవడానికి అసలయిన కారణాలు ఏమిటనే విషయం బయటపడవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu