ఎంఐఎం ఎమ్మెల్యేల చేరికతో బీహార్‌లో మ‌ళ్లీ పుంజుకున్న ఆర్‌జేడి

బీహార్‌లో తేజ‌స్వ‌నీ యాద‌వ్  నాయకత్వంలోని  ఆర్‌జెడి మ‌ళ్లీ  అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.  నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీ గూటికి చేరడంతో ఇది సాధ్యమైంది.  ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ సభ్యుల సంఖ్య 80కి చేరింది. అంటేజెడియుతో  క‌లిసి అధికారంలో వున్న బిజెపికి ఉన్న సభ్యుల సంఖ్య కంటే  ఆర్జేడీకి ముగ్గురు ముగ్గురు ఎక్కువ కావ‌డంతో ఆర్‌జెడి మ‌రోసారి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. కాగా 243మంది స‌భ్యుల బీహార్ అసెంబ్లీ లో .జేడీయూ ఎమ్మెల్యేలు 45 మంది వున్నారు.  

2020 బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్‌జెడి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది.  అయితే  బీజేపీ, జేడీయూ కూటమి కంటే తక్కువ మంది సభ్యులు ఉండటంతో మెజారిటీకి దూరమై విపక్షంగా మిగిలిపోయింది. నితీష్ కుమార్ బిజెపితో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు, అయితే  అధికార కూటమిలో బీజేపీదే పై చేయిగా నిలవడంతో నితీష్ కుమార్ ఒకింత ఒత్తిడికి లోనవుతూ వచ్చారు. పలు సందర్భాలలో ఆయన కేంద్ర నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించారు. కులగణన వంటి ప్రధాన సమస్యలపై సీఎం నితీష్ కుమార్ విపక్ష నేత తేజస్వి స్టాండ్ నే తీసుకున్నారు. ఇది జేడీయూ, ఆర్జేడీలు మళ్లీ దగ్గరౌతున్నాయన్న ఊహాగానాలకు తెరతీసింది.

అయితే బీజేపీ, జేడీయూ పొత్తు విచ్ఛిన్నం కాకుండా సాగుతూనే వచ్చింది. తాజాగా ఎంఐఎం నుంచి నలుగురు సభ్యులు ఆర్జేడీ గూటికి చేరారు. వారి చేరికను ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ లౌకిక శక్తుల బలోపేతంగా అభివర్ణించడమే కాకుండా ఆ నలుగురినీ తన కారులోనే అసెంబ్లీకి తీసుకు వెళ్లారు. కాగా వీరి చేరికతో ఆర్జేడీ బలం పెరగగా ఎంఐఎం బలం ఐదు నుంచి ఒకటికి పడిపోయింది. 

 ఆర్‌జెడి గ‌త ఎన్నిక‌ల్లో 75 స్థానాలు గెలుచుకుని ఒంటరిగా విజ‌యం సాధించిన పెద్ద పార్టీగా నిలిచింది.  త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఒక స్థానం గెలిచింది. లౌకిక‌శ‌క్తుల‌న్నీ ఏక‌మై ప‌టిష్ట‌ప‌డాల‌ని, బీహార్‌లో బీజెపి ఒంట‌రిగా పోటీచేసి గెలిచే స‌త్తా లేద‌ని తేజ‌స్వీయాద‌వ్ అన్నారు.  పరోక్షంగా ఆయన బీజేపీకి దూరం కావాలని జేడీయూకి సూచించారు.  సైద్ధాంతిక సారూప్యత లేని జేడీయూతో జత కట్టి అధికారంలో భాగస్వామిగా కొనసాగడం ద్వారా బీజేపీ నైతికతకు తిలోదకాలిచ్చేసిందని తేజస్వి విమర్శించారు.