రేవంత్ వ్యూహంతో మారిన జూబ్లీ సీన్!

సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో అనివార్యం అయిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక ముహూర్తం ఇంచుమించుగా ఖారారైంది. అందరూ అనుకుంటున్నట్లుగానే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, జూబ్లీ ఉప ఎన్నిక జరగ వచ్చని అన్నారు. అంటే అక్టోబర్ లేదా  నవంబర్ లో జూబ్లీ ఉపఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఉప ఎన్నిక ముహూర్తం విషయం పక్కన పెడితే..  జూబ్లీ ఉపఎన్నిక రోజు రోజుకు రంజుగా మారుతోంది. ఆసక్తిని పెంచుతోంది. కొత్త కోణాలు వచ్చి చేరుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ  జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ క్రికెటర్ ,మాజీ ఎంపీ అజారుద్దీన్  బరిలో దిగుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది.అంతే కాదు..  ఆయన రాష్ట్ర నాయకుల ప్రమేయం లేకుండా  నేరుగా ఢిల్లీ నుంచే  టికెట్’ కన్ఫర్మ్  చేసుకున్నారనే  ప్రచారం కూడా జరిగింది. 

అయితే.. కాంగ్రెస్ పార్టీ హటాత్తుగా అజారుద్దిన్ ను గవర్నర్ కోటాలో పెద్దల సభ (శాసనమండలి) కి పంపాలని నిర్ణయించింది.  ప్రొఫెసర్ కోదండ రామ్ తో పాటుగా అజారుద్దీన్ ను శాసన మండలికి సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. నిజానికి.. మాగంటి మరణ వార్త చెవిన పడిన క్షణం నుంచే, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అజారుద్దీన్  జూబ్లీ టికెట్ తనదే అని ప్రచారం చేసుకున్నారు. అయితే.. ఇప్పడు అజారుద్దీన్  టికెట్ రేసు నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. అదలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పక్కా లెక్కలతోనే..  అజారుద్దీన్ ను రేసు నుంచి తప్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అజారుద్దీన్  అభ్యర్ధిత్వం పట్ల అంత సుముఖంగా లేరనీ,  అందుకే  అజారుద్దీన్  తనకు తానుగా  జూబ్లీ అభ్యర్ధిగా ప్రకటించుకున్న సమయంలో  పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్  గట్టి వార్నింగ్’ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తపరిచిన నేపధ్యంలోనే పీసీసీ చీఫ్ అజారుద్దీన్ ను గాంధీభవన్  కు  పిలిపించి మరీ క్లాసు తీసుకున్నారని అప్పట్లో పార్టీ వర్గాల్లో వినిపించింది.    

 
అలాగే..  కాంగ్రెస్ పార్టీ అనధికార మిత్ర పక్షం ఎంఐఎం కూడా అజారుద్దీన్  అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. మరోవంక లక్షకు పైగా ముస్లిం ఓటర్లున్న జూబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలవాలంటే  ఎంఐఎం మద్దతు అనివార్యం.  అందులో అనుమానం లేదు. ఈ కారణంగానూ  అజరుద్దీన్  ను తప్పించి  గతంలో ఎంఐఎం టికెట్ పై పోటీ చేసిన బీసీ నాయకుడు నవీన్ యాదవ్  ను ముఖ్యమంత్రి రెంత్ రెడ్డి తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి..  మొదటి నుంచి కూడా నవీన్ పేరు వినిపిస్తూనే వుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా నవీన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరిగింది. 

అలాగే  నవీన్ యాదవ్ ను బరిలో దించితే ఎంఐఎం మద్దతు పొందడమే కాకుండా, బీసీ ఛాంపియన్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మరో ప్లస్ పాయింట్ అవుతుందని, బీసీ నినాదానికి మరింత బలం చేకూరుతుందని  విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా.. బీజేపీ, హిందుత్వ రాజకీయాలను, హిందూ ఓటు బ్యాంక్  పోలరైజేషన్  ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్ట వచ్చని రేవంత్ రెడ్డి  భిన్న కోణాల్లో లెక్కలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. 

అయితే..  ఇప్పటికి కూడా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మేయర్ బి.రామ్మోహన్, మైనారిటీ వర్గం నుంచి ఫహీం ఖురేషి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు  తెలుస్తోంది. అయితే..  చివరకు ఏమి జరుగుతుంది? హస్తం టికెట్ ఎవరి చేతికి చిక్కుతుంది?  అన్నది స్టిల్ ఏ పజిల్ .. ఇప్పటికీ ఎటూ తేలని ప్రశ్నేై!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu