తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా డీకే.. రేవంత్‌ రెడ్డి ఆటలు ఇక సాగవా..?

కర్ణాటక గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ లో మంచి ఊపు  కనిపిస్తుంది. సీనియర్లు తమ దూకుడును పెంచినట్లు కనిపిస్తోంది.  టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇటీవల కర్ణాటకకు వెళ్లి సలహాలు సూచనలు స్వీకరించారు. అంతర్గత సమస్యలు సమసిపోయేలా ఏం చేయాలనే ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.  ఈ క్రమంలో పలువురు సీనియర్లు కూడా డీకే శివకుమార్ తో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్నాళ్లుగా కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం పైకి సమసిపోయినట్లు కనిపిస్తున్నా.. లోలోపల రగులుతూనే ఉంది. అనాదిగా...కాంగ్రెస్‌ అంటేనే కయ్యాలు.. అంతర్గత కుమ్ములాటలు.. అసంతృప్తులు.. అలకలు.. ముఠా తగాదాలు.. వగైరా..వగైరాలు..   రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత ఈ కయ్యాలు ఎక్కువయ్యాయి. సీనియర్లు సహాయ నిరాకరణ ప్రకటించారు. రేవంత్‌ సారథ్యంలో పనిచేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో అసలైన కాంగ్రెస్‌ వాదులం అంటూ మరో గ్రూపుగా ఏర్పడ్డారు. రేవంత్‌ను వెనక్కు లాగేందుకు పార్టీకి కూడా నష్టం చేస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణపైన ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో బీజేపీ బలం పెరగకూడదని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ దారు తామేనని భావిస్తోంది. ఈ సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. కర్ణాటక విజయంతో పార్టీలో విభేదాలు సమసిపోయినట్లు కనిపిస్తున్నా.. అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతన్నట్లు గుర్తించింది. అవి నివురు కప్పిన నిప్పులా ..లోలోన మండుతున్నాయి.   దీంతో కర్ణాటక తరహాలో అంత కలిసి పనిచేసేలా చూడాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్టీలోని సీనియర్లకు సన్నిహితుడైన ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను తెలంగాణ ఇన్‌చార్జిగా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.
కర్ణాటక, మహరాష్ట్ర, రాజస్థాన్ లో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడానికి డికె శివకుమార్ పాత్ర అంతా ఇంతా కాదు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాళ్లకు చక్రాలు కట్టుకుని బొంగరంలా తిరిగారు. అదే ఫార్ములాను మిగతారాష్ట్రాల్లో ప్రయోగించాలని అధిష్టానం భావిస్తోంది. 

ట్రబుల్‌ షూటర్‌గా డీకేకు గుర్తింపునిస్తూ.. కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా అయిన ఆయనకే ఇన్ చార్జ్ బాధ్యతలు కట్టబెడుతూ.. అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.  శివకుమార్‌కు ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు ఉంది. కష్టాల్లో పార్టీని గట్టెక్కించగల సమర్థుడుగా అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణపై ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా డీకేను తెలంగాణలో దించాలని భావిస్తోంది. సీనియర్లతో డీకేకు మంచి సంబంధాలు ఉన్నందున ఆయన అంతర్గత సంక్షోభానికి తెరదించుతారని అధిష్టానం భావిస్తోంది. బీఆర్ఎస్, బిజెపీల నుంచి వచ్చే నేతల చేరికల బాధ్యత డికె కు అప్పగించాలని యోచిస్తోంది. 

రేవంత్‌ నాయకత్వాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల వీరు కర్ణాటకకు వెళ్లి డీకేను కలిశారు. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ వీరికి బాధ్యతలు అప్పగించారు. దీంతో డీకేతో సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలో సీనియర్లు డీకేను తెలంగాణ ఇన్‌చార్జిగా తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంబించారు. ఈమేరకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ప్రారంభించారు. ఈ ప్రదిపాదనను అధిష్టానం కాదనే నమ్మకం సీనియర్లలో వ్యక్తమవుతోంది.

ఇప్పటికే డీకే సలహాలు..
కర్ణాటక విజయంతో తెలంగాణలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఈ క్రమంలో డీకే సూచనలు కూడా స్వీకరిస్తోంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇటీవల కర్ణాటకకు వెళ్లి సలహాలు సూచనలు స్వీకరించారు. అంతర్గత సమస్యలు సమసిపోయేలా ఏం చేయాలనే ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో పలువురు సీనియర్లు కూడా డీకేతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

సమన్వయం..వ్యూహాలు..
డీకే శివకుమార్‌ నియామకం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని కాంగ్రెస్‌ అధిష్టానం అంచనా వేస్తోంది. పార్టీలో సీనియర్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. పార్టీ వేగంగా ముందుకు వెళుతున్న ప్రతిసారీ ఈ అంతర్గత విభేదాలతో తలనొప్పులు ఎదురవుతున్నాయి. మరోపక్క ఇతర పార్టీలకు చెందిన సీనియర్‌ నేతల చేరికల విషయంలో కూడా తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. సోనియా, రాహుల్, ప్రియాంకలతో డీకేకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఇక్కడి పార్టీ వ్యవహారాలను ఆయన స్వతంత్రంగా, సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధిష్టానం అంచనాల మేర.. అన్నీ సక్రమంగా జరిగితే.. కాంగ్రెస్ తెలంగాణలో ఊపిరి పోసుకోవచ్చు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu