లోక్ సభ తుది జాబితా కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి 

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ బ‌య‌లుదేరారు. సీఎం వెంట మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ వెళ్లారు. లోక్‌స‌భ అభ్య‌ర్థుల తుది జాబితాపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని స‌మాచారం. ఇక రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాల‌కు గాను ఇప్ప‌టికే 9 స్థానాల‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. మిగిలిన 8 స్థానాల‌కు నేడు చ‌ర్చ‌ల అనంత‌రం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. మ‌రో కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వీహెచ్‌ పార్ల‌మెంట్ టికెట్ ఆశించారు. కానీ, టికెట్ త‌న‌కు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఆయన అల‌క‌బూనారు. దీంతో గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఈ సీనియ‌ర్ నేత దూరంగా ఉంటున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల మీడియా స‌మావేశంలోనూ ఆయ‌న బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే, ఇలా పార్టీకి దూరంగా ఉంటున్న వీహెచ్‌ను మ‌హేశ్ కుమార్ గౌడ్ బుజ్జ‌గించి సీఎం వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి.. వీహెచ్‌కు అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.