ఉండాలీ కానీ.. మరీ అంత కాదు..!!
posted on Nov 1, 2017 10:07AM

కొందరు మేధావులు అమాయకుల్లా కనిపిస్తారు.. కొందరు అమాయకులు మేధావుల్లా కనిపిస్తారు. ఈ స్టేట్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి గారిని చూడగానే అనిపిస్తుంటుంది. ఇంతకీ.. జానారెడ్డి గారు మేధావా..? అమాయకుడా..? అసెంబ్లీలో ఏదైనా సమస్య మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన స్పీచ్ విన్నవారికి ఎవరికైనా సరే ఆ డౌట్ వస్తుంది. ఎంతో సబ్జెక్ట్ ఉండి కూడా విషయాన్ని స్ఫష్టంగా చెప్పలేకపోవడం నిజంగా దురదృష్టమే. సరే ఆ సంగతి పక్కనబెడితే.. ఆయన ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో జానా పోషించని పాత్ర లేదు. చేపట్టని పదవీ లేదు. అందుకే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా " పెద్దలు జానారెడ్డి గారు అంటూ వినయంగా సంభోదిస్తారు.
అలాంటి వ్యక్తి తెలిసి అన్నారో.. లోపల తనను తాను అలా ఊహించుకుంటున్నారో కానీ ఒక మాట అనేసారు. తాను కాంగ్రెస్ పార్టీలో అద్వానీ అంతటి వాడినని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగితే కదా.. నేను సీఎం పదవిని అడగను.. పార్టీ, కార్యకర్తలు, నాయకులు అందరూ కోరుకుంటే కనుక ఈ పదవి చేపడతానని మనసులోని మాటను బయటపెట్టారు.
ఆయన ఇలా మాట్లాడటానికి కారణం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బలమైన వాగ్ధాటి, అభిమానగణం, దూకుడు ఉన్న రేవంత్ పార్టీలోకి వస్తే తన పరిస్థితి ఏంటా అని ఆయన లోలోపల మదనపడుతున్నారని.. అందుకే అద్వానీతో పొల్చుకున్నారని అంటున్నారు . అంటే ప్రధాని పదవి దక్కించుకోవడంలో విఫలమైన అద్వానీతో తనను తాను పోల్చుకున్న జానారెడ్డి... సీఎం పదవి కూడా తనకు అదేరీతిలో అందని ద్రాక్షగా మిగిలిపోతుందేమోనని ఈ సంకేతాలను ఇచ్చారా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.