రేణుకా చౌదరిపై పోలీస్ కేసు నమోదు

 

మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరిపై ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసారు. ఆమెపై రాంజీ అనే స్థానిక నేత భార్య భూక్యా కళావతి ఆనే ఆమె కేసు వేసింది. గత ఎన్నికలలో తన భర్త రాంజీకి ఖమ్మం జిల్లాలో వైరా అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి రేణుకా చౌదరి తన భర్త వద్ద నుండి రూ.1.10 కోట్లు పుచ్చుకొన్నారని ఆమె ఆరోపించారు. కానీ రేణుకా చౌదరి తన భర్తకు ఆమె టికెట్ ఇప్పించకపోవడంతో ఆయన తీవ్ర మానసికవేదన అనుభవించి చనిపోయారని తెలిపారు. ఆ తరువాత ఆమెను తమ డబ్బు వాపసు చేయమని ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకపోగా, ఆమె తనను కులం పేరుతో దూషించారని, తాను ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు పిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో కళావతి హైకోర్టులో పిటిషను వేసారు. దానిపై స్పందించిన హైకోర్టు తక్షణమే రేణుకా చౌదరిపై కేసు నమోదు చేసి విచారించమని పోలీసులను ఆదేశించడంతో వారు రేణుకా చౌదరిపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

 

కానీ రేణుకా చౌదరి తనెన్నడూ ఆమెను కానీ, ఆమె భర్తని గానీ కనీసం చూడలేదని, తన రాజకీయ ప్రత్యర్ధులు తనను అప్రదిష్టపాలు చేసేందుకే ఈవిధంగా తనపై కుట్రలు పన్నుతున్నారని ఆమె మీడియాతో అన్నారు.