రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్.. అసలు కారణం ఇదే!

తెలంగాణలో రాజకీయ పరిణామాలు గత పదేళ్లూ ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా ఉన్నాయి. తెలంగాణ ఆవిర్బావం తరువాత పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. రాష్ట్రంలో విపక్షాల పొడే గిట్టనట్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను బలహీనం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గేట్లు బార్లా తెరిచారు. వచ్చిన వారికి వచ్చినట్లు బీఆర్ఎస్ కండువా కప్పేశారు. ఇలా చేయడం వల్ల ఆయన పొందిన రాజకీయ లబ్ధి కంటే నష్టమే ఎక్కువ అని ఇప్పుడు బయటపడుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడం ద్వారా బీఆర్ఎస్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు, తొలి నుంచీ ఆ పార్టీలోనే ఉన్న వారి మధ్య సత్సంబంధాలు లేకుండా పోయాయి. ఒకరికొకరు ప్రత్యర్థులుగానే భావించుకుంటూ గ్రూపులు కట్టారు. ఆ గ్రూపులే 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది.  

సరే ఆ ఎన్నికలలో  కాంగ్రెస్ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఎలాగైతే ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగంతో బలహీనం చేశారో.. సరిగ్గా అలాగే రేవంత్ ఇప్పుడు బీఆర్ఎస్ శాసన సభా పక్షాన్ని ఖాళీ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక వల్ల ఆ పార్టీలో వెల్లువెత్తిన అసమ్మతి కాంగ్రెస్ లో వ్యక్తం కావడం లేదు. ఒక్క జీవన్ రెడ్డి వినా మరెవరూ ఈ చేరికలను వ్యతిరేకించిన దాఖలాలు లేవు. 

అసలు కాంగ్రెస్ అంటేనే గ్రూపులూ, అసమ్మతులూ.. అటువంటి కాంగ్రెస్ లో బయటి నుంచి చేరికల పట్ల అసమ్మతి, అసంతృప్తి వ్యక్తం కావడం లేదు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే కారణం. ఎందుకంటే ఆ చట్టం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాలలో 2026 నాటికి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కు పెరుగుతుంది. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఆశావహులకు వచ్చే ఇబ్బంది పెద్దగా లేదు. అలాగే తెలంగాణ అసెంబ్లీలో పెరిగే స్థానాలలో అత్యధికంగా జీహెచ్ఎంపీ, హెచ్ఎండీఏ పరిధిలోనే పెరుగుతాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 24 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఆ సంఖ్య 2026లో 54కు పెరుగుతుంది. అందుకే రేవంత్ రెడ్డి ఎక్కువగా గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇదే కారణంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందుతున్నారు. ఈ వలసల కారణంగా భవిష్యత్ లో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు సన్నగిల్లు తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ తన బలాన్ని మరింత పెంచుకుని బలపడుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తానికి విభజన చట్టం కారణంగా రేవంత్ రాజకీయాంగా లబ్ధి పొందుతున్నారని చెప్పవచ్చు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu