నాని ఓడిపోతాడు... పీవీపీ గెలుస్తాడు... ఏబీవీపై కేశినేని కోపానికి కారణమిదేనా?

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం, అటు తిరిగి ఇటు తిరిగి, తెలుగుదేశంలోనే చిచ్చురేపింది. ఏబీవీ సస్పెన్షన్‌పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుంటే, టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌ ఇప్పుడు తెలుగుదేశంలోనే కలకలం రేపుతోంది. అసలు ఏబీవీని వెనకేసుకురావడమేంటంటూ టీడీపీ నేతలనే తీవ్రంగా తప్పుపట్టారు కేశినేని. ఎందుకంటే, తప్పుడు రిపోర్టులతో చంద్రబాబును నిండా ముంచిన ఏబీవీ, వైసీపీకి మేలు చేశారనేది కేశినేని వాదన. కేశినేని నాని బయటపడ్డారు కానీ, ఎంతో మంది టీడీపీ సీనియర్లు ఇంకా అదే అభిప్రాయంతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఏబీవీకి టీడీపీ అండగా నిలవడాన్ని కేశినేని తప్పుబట్టడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విజయవాడ పోలీసు కమిషనర్‌గా పగ్గాలు చేపట్టిన ఏబీవీని, ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ వైఫల్యం చెందారంటూ, ఆమె స్ధానంలో నిఘా విభాగం అధిపతిగా ఏబీని నియమించుకున్నారు చంద్రబాబు. అయితే చంద్రబాబుతో ఆయనకున్న సాన్నిహిత్యం ప్రతిపక్ష వైసీపీకే కాదు, టీడీపీలోని పలువురు సీనియర్లకూ నచ్చలేదట. వారిలో కేశినేని నాని ఒకరు. ఎందుకంటే, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రాష్ట్రంలో వాస్తవ పరిస్ధితులను చెప్పాల్సిందిపోయి, టీడీపీ పరిస్ధితి అన్నిచోట్లా బావుందని తప్పుడు నివేదికలు ఇచ్చారని, అదే తెలుగుదేశం ఘోర పరాజయానికి కారణమైందనేది కేశినేని వాదన. అయితే, ఏబీవీ తప్పుడు నివేదికల వల్లే పార్టీకి జరగరాని నష్టం జరిగిందని టీడీపీ సీనియర్లు రగిలిపోతున్నారట. 

అయితే, కేశినేని బాధ అదొక్కటే కాదట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని ఏబీవీ వ్యతిరేకించారట. కేశినేనికి టికెట్ ఇస్తే ఓడిపోతారంటూ చంద్రబాబుకు నివేదికలిచ్చారట. ఇదే, కేశినేని కోపానికి కారణమంటున్నారు. ఇలా, తప్పుడు రిపోర్టులతో టీడీపీని తప్పుదారి పట్టించి, పరోక్షంగా వైసీపీకి మేలు చేశారని, అలాంటి ఏబీని టీడీపీ వెనకేసుకురావడమేంటని కేశినేని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఏబీ వెంకటేశ్వర్రావు సస్పెన్షన్‌, చివరికి టీడీపీలోనే చిచ్చురేపింది. కక్షపూరితంగా సస్పెండ్ చేశారని చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, అందుకు విరుద్ధంగా అదే పార్టీ ఎంపీ నాని మాట్లాడటం చర్చనీయాంశమైంది. దీంతో జగన్ ప్రభుత్వం మీద టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు విలువే లేకుండాపోతోందన్నది మిగతా టీడీపీ నేతల ఆవేదన. అలా, ఏబీవీ సస్పెన్షన్‌, చివరికి తెలుగుదేశంలోనే రచ్చకు దారి తీస్తోంది.