ప్రేమికుల రోజున కేజ్రీ ప్రమాణం... ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠంపై...

సామాన్యుడి చీపురు.. మరోసారి ఊడ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీని.. క్లీన్ స్వీప్ చేసింది. కేజ్రీవాల్‌.. తీన్‌మార్‌ కొట్టారు. ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠంపై కూర్చోబోతున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపిన ఢిల్లీ ఎన్నికల్లో.. రాజధాని ప్రజలు సామాన్యుడికే పట్టం కట్టారు. బీజేపీ, ఆప్ మధ్య తీవ్ర పోటీగా మారిన ఎన్నికల్లో.. ఫలితం ఒకేవైపు నిలిచింది. బీజేపీ మాత్రం మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కౌంటింగ్ మొదలైన క్షణం నుంచీ ఆప్‌ దూసుకుపోయింది. మెజార్టీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ అభ్యర్థులు ముందంజలో నిలిచారు. అయితే రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థులు... ఒకానొక సమయంలో 20కి పైగా స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు కనిపించారు. కానీ ఆ ఊపు ఎంతో సమయం నిలువలేదు. అనూహ్యంగా ఆయా స్థానాల్లో ఆప్ అభ్యర్థులు విజయం సాధించడంతో మొత్తం 62 స్థానాల్లో కేజ్రీవాల్ పార్టీ పాగా వేసింది. ఢిల్లీ ప్రజలు సరికొత్త చరిత్ర లిఖించారని.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. ఈ విజయం.. సరికొత్త రాజకీయాలకు నాంది అని.. అభివృద్ధికి ఓటేశారని తెలిపారు. మరోవైపు కేజ్రీవాల్‌కు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక, ఈసారి కూడా ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14న మూడోసారి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. 2015 లో 3 స్థానాలు నెగ్గిన కమలం పార్టీ.. ఈసారి అధికారం తమదే అంటూ చెప్పుకొచ్చిన కాషాయ పార్టీ.. కనీసం డబుల్‌ డిజిట్‌ కూడా సాధించలేకపోయింది. ప్రజల తీర్పు గౌరవిస్తామని.. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని.. ఫలితాల తర్వాత బీజేపీ అగ్రనాయకులు ప్రకటించారు.