రాయల తెలంగాణ పై కేంద్రం ఆరా..!

 

 

 

రాష్ట్ర విభజన అంశం కీలక దశకు వచ్చిన సమయంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రాయల తెలంగాణ అ౦శాన్ని తెరమీదకు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాయల తెలంగాణ పై వివిధ పార్టీల అభిప్రాయాలను కేంద్రం రహస్యంగా సేకరిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతంలోని తెరాస, బిజెపి, సిపిఎం, సిపిఐ పార్టీల ఎమ్మెల్యేలను ఈ విషయం పై ఇంటెలిజెన్స్ అభిప్రాయం అడగడంతో, ఈ విషయం బయటికివచ్చింది.

 

పది జిల్లాల తెలంగాణకే తాము కట్టుబడి ఉన్నామని బిజెపి, తెరాసలు చెప్పాయి. బిల్లు చూశాక చెబుతామని సిపిఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎంఐఎం  రాయల తెలంగాణాకు సుముఖుంగా ఉండడం, అనంతపురం, కర్నూల్ జిల్లాల నేతలు కూడా ఇదే విషయంపై పట్టుపడుతుండడంతో కేంద్రం రాయల తెలంగాణ ఏర్పాటుకే మొగ్గుచూపుతోంది అన్నది విశ్వసనీయ సమాచారం.  దీంతో రాయల తెలంగాణ అంశం మరోసారి ప్రాదాన్యతను సంతరించుకుంది.


అయితే ఈ అంశానికి తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నందున విభజన అంశం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరోవైపు తనకు రాయల తెలంగాణ అంశంపై ఐబి నుండి ఫోన్ వచ్చిందని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. కేంద్రం రాయల తెలంగాణతో మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదించుకునేందుకు కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు.