నల్లజర్లలో రేవ్ పార్టీ!
posted on Aug 20, 2025 1:01PM

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రేవ్ పార్టీ కలకలం రేపింది. పుట్టిన రోజు పార్టీ అంటూ నల్లజర్ల మండలం ఘంటవారి గూడెంలో రేవ్ పార్టీ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేసి ముగ్గురు యువతులు, పాతిక మంది పురుషులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, ఏడు కార్లు, ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
పాశ్చాత్య మోజులో పడి ఇటువంటి అసాంఘిక, అనైతిక కార్యక్రమాలకు తెగబడితే ఉపేక్షించేది లేదని పోలీసు అధికారలు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా ఇంత వరకూ హైదరాబాద్ వంటి మెట్రోపాలిటిన్ నగరాలకే పరిమితం అనుకున్నరేవ్ పార్టీ కల్చర్ పచ్చదనంతో కళకళలాడే తూర్పుగోదావరి జిల్లాకూ పాకడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. నల్లజర్ల సంఘటన విషయానికి వస్తే బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.