లాపతా లేడీస్ సినిమాకు అపురూప గౌరవం.. సుప్రీం ఆడిటోరియంలో ప్రదర్శన
posted on Aug 9, 2024 12:04PM
ఓ సందేశాత్మక చిత్రానికి అపురూప గౌరవం దక్కింది. ఆ చిత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు తిలకించనున్నారు. శుక్రవారం (ఆగస్టు 9) సాయంత్రం సుప్రీం కోర్టు ఆడిటోరియంలో జరిగే ఈ చిత్ర ప్రదర్శనను సుప్రీం కోర్టు రిజిస్ట్రార్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా వీక్షిస్తారు.
లింగ సమానత్వం ఇతివృత్తంగా తెరకెక్కిన ‘లపతా లేడీస్’ అనే సినిమాకు ఈ అపూర్వ గౌరవం దక్కింది. ఈ సినిమా సమాజంలో లింగభేదం ఎంత తీవ్రంగా ఉందో కళ్లకుకట్టినట్లు చూపింది. సుప్రీం కోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆడిటోరియంలో ఆ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ సినిమా దర్శకురాలు కిరణ్ రావు, నిర్మాత, నటుడు అమీర్ ఖాన్ కూడా సుప్రీం ఆడిటోరియంలో సీజేఐ, న్యాయమూర్తులతో కలిసి ఈ ప్రదర్శనకు హాజరౌతారు.
ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఇతివృత్తంగా దీన్ని తెరకెక్కించారు. కాగా సుప్రీం ఆడిటోరియంలో ప్రదర్శనకు నోచుకున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.