నిప్పులు చిమ్మే సూర్యుడి మధ్యన మర్యాద పురుషోత్తముడు!

* రామజన్మభూమి లోగో ఆవిష్కరించిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 
* ఉవ్వెత్తున ఎగిసిన హిందూ జాతీయ వాదానికి, వాస్తవానికి రాజీవ్ గాంధీనే ప్రధాని హోదాలో బీజం వేశారనే వాదన ఇప్పటికీ 10, జనపథ్ లో వినిపిస్తూ ఉంటుంది 
* తల్లి ఇందిరా గాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ అయిష్టంగానే ప్రధాని బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత యధాలాపంగా రామజన్మభూమి అంశం లో ఆయన తీసుకున్న నిర్ణయాలు -తర్వాతి ఉద్యమాలకు ఆక్సిజన్ అందించటం అందరికీ తెలిసిన విషయాలే 

శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా రిలీజ్ చేసిన రామజన్మభూమి లోగో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హనుమజ్జయంతి సందర్భంగా ట్రస్ట్ ఈ లోగో ను రిలీజ్ చేసింది. ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు కనిపించేలా ఆకర్షణీయంగా లోగో ను రూపొందించారు. ఎరుపు, పసుపు, కాషాయ రంగులతో ఈ లోగో కు మరింత వన్నె తెచ్చారు. అయోధ్య లో శ్రీ రామ మందిర పునర్నిర్మాణం కోసం ఏర్పడిన ఈ ట్రస్ట్, ఏప్రిల్ 2 వ తేదీన ఆలయ నిర్మాణానికి శంకు స్థాపన కూడా చేసింది. ఈ సందర్భంగా,అయోధ్యలో ఒక పండుగ వాతావరణం ఆ రోజు నుంచీ నెలకొంది.

శతాబ్దాల పోరాటం తర్వాత జరగబోతున్న ఈ మహత్కార్యం వెనుక ఎవరెవరు, ఏ స్థాయిలో తమ సేవలందించారో అయోధ్య వాసులు, సాధు సంతులు గుర్తు చేసుకోవటం మొదలెట్టారు.  అయోధ్య వివాదాస్పద స్థలం రామమందిర నిర్మాణానికి కేటాయిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అంతిమ తీర్పులో- ప్రధాన న్యాయమూర్తిగా హోదాలో  రంజన్‌ గొగోయి, ఆ స్థానంలోకి రానున్న ఎస్‌.ఎ.బాబ్డే లతో సహా పంచసభ్య ధర్మాసనం నిర్విరామంగా నలభై రోజులు వాదోపవాదాలు విని ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కూడా కావడం అసాధారణ ప్రక్రియ. ఆ రీత్యా తీర్పుపై సమీక్షలు, పునర్విచారణలు అంత తేలికగా అనుమతి పొందలేకపోవచ్చు. బ్రిటిష్‌ పాలనలో నూట నలభై ఏళ్ల కింద మొదలై, స్వాతంత్య్రానంతరం డెబ్బై ఏళ్ల కిందట మరింత క్లిష్టమై, నూట పాతికేళ్లుగా కోర్టుల ముందు తిరుగుతున్న ఒక వివాదం, ఇంత వేగంగా తేల్చి చెప్పడం నిజంగానే గతంలో ఎరగని విషయం. ఇందులో జయాపజయాల ప్రసక్తి లేదనీ అందరూ తీర్పునకు కట్టుబడి శాంతిని కాపాడాలని ప్రధాని మోడీ, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ అంటున్నారు. శాంతి సామరస్యాలను కాపాడుకోవాలని నొక్కి చెబుతూనే తీర్పునకు సంబంధించిన కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారూ వున్నారు. దానికి సమస్య జటిలతతో పాటు తీర్పు లోని సంక్లిష్టత మిశ్రమ స్వభావం కూడా కారణమని చెప్పాలి.

అయోధ్య వివాదం ఏయే దశల్లో ఎన్ని మలుపులు తిరిగిందీ కుదుపులు తెచ్చింది చాలా వివరంగా వచ్చింది గనక మళ్లీ ఏకరువు పెట్టడం అనవసరం. వివాదాస్పద స్థలంలో రామమందిరం కూలగొట్టి బాబర్‌ మసీదు కట్టించాడు గనక అక్కడే రామ మందిరం కట్టాలన్నది సంఘ పరివార్‌ ప్రధాన నినాదం. 1949 నుంచి తాళాలు పడి వున్న వివాదాస్పద స్థలం తాళాలు తెరిపించి ఆ తాళం దాని చేతికి ఇచ్చింది అప్పటి కాంగ్రెస్‌ ప్రధాని రాజీవ్‌ గాంధీ. ఉత్తరోత్తరా 1992 డిసెంబర్‌ ఆరున మసీదు కూల్చివేతకు అవకాశమిచ్చింది పి.వి నరసింహారావు. సాధు సంతుల పేరిట ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించింది అద్వానీ బృందం. ఇదీ క్లుప్తంగా చరిత్ర. 'భిన్న విశ్వాసాల మధ్య ఘర్షణ వస్తే పరస్పరం సంప్రదింపులతో పరిష్కరించుకోవాలి. లేదంటే కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాలి'. అని ఈ కాలమంతటా కూడా వామపక్షాలు లౌకిక వాదులూ చెబుతూ వచ్చారు. ఆ సమయంలో పరివార్‌ అందుకు సుతరామూ అంగీకరించలేదు. విశ్వాసాలు, కోర్టు తీర్పులకూ రాజ్యాంగ నిబంధనలకు అతీతమని వాదించారు అద్వానీ. అలా అంటూనే కోర్టుకు ఇచ్చిన మాట తప్పి కూల్చివేతకు కారకులైనారు. 

1992 తర్వాత పాతికేళ్లకు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం విశ్వాసాలు వున్నాయనే నిజం ఆధారంగా తీర్పు నివ్వడం పెద్ద విశేషం. కూల్చివేయబడిన మసీదు గోపురాల మధ్యనే రాముడు జన్మించాడని హిందువులు బ్రిటిష్‌ వారి కాలం నుంచి విశ్వసిస్తున్నారని కోర్టు విశ్వసించింది. మసీదు ప్రాంగణంలో 'రామ్‌ చబూత్రా'కు అది పరిమితం కాదని నొక్కి చెప్పింది. నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కంచె వేసిన కారణంగా వారు చబూత్రాకు పరిమితమైనారని అభిప్రాయపడింది. ఆనాటి నుంచి వారిలో ఆ విశ్వాసం వున్నదనే విషయాన్ని కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డు కూడా కాదనడం లేదని పేర్కొంది. మరో వంక ఆ స్థలంపై తమకు యాజమాన్యం వుందనే వక్ఫ్‌ బోర్డు వాదన కూడా రాముడు పుట్టాడన్న నమ్మకానికి ప్రతిబింబం వంటిదేనని రెంటినీ ఒకటిగా చెప్పింది. అయితే ఈ విషయంలో సమతుల్యతతో వ్యవహరించాలంటూ మరోవైపు నుంచి కూడా కొన్ని నిర్ధారణలు చేసింది. బాబర్‌ కాలంలో మసీదును ఖాళీ స్థలంలో కట్టలేదనీ, దాని కింద దొరికిన అవశేషాలు ఇస్లామేతర కట్టడానికి సంబంధించినవనీ సుప్రీం కోర్టు తీర్పులో చెప్పింది.అయితే అవతలి పక్షం వాదిస్తున్నట్టు అది రామాలయం అనడానికి గాని, దాన్ని కూల్చి ఇది కట్టారని చెప్పడానికి గాని ఆధారం లేదని పురావస్తు నివేదికల అధ్యయనంతో నిర్ణయానికి వచ్చింది. అలాగే అక్కడ మసీదు లేదనీ ప్రార్థనలు జరగడమేలేదని చెప్పడం కూడా వాస్తవం కాదని పేర్కొంది. అదే ప్రాంగణంలో గతం నుంచి ఇరు మతాల ప్రార్థనలు జరుగుతుండగా 1949లో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తెచ్చి పెట్టడం, 1992లో కూల్చివేత వారి విశ్వాసాలకు విఘాతమని కూడా స్పష్టీకరించింది.

ఈ పూర్వ రంగంలో 2010న అలహాబాద్‌ హైకోర్టు వివాదాస్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మొహి అఖాడా, రామ్‌లల్లా విరాజ్‌మాన్‌లకు సమానంగా కేటాయిస్తూ ఇచ్చిన తీర్పు తర్క విరుద్ధమన్నది ధర్మాసనం చేసిన కీలకమైన నిర్ధారణ. బహుశా ఇప్పటికే అక్కడ తాత్కాలిక ఆలయం వుండటం, ముగ్గురూ ఒకే చోట మనడం సాధ్యం కాదు గనక ఏదో విధంగా ముగింపు పలకాలన్న భావన కూడా దీని వెనక వుండొచ్చు. రామ్‌లల్లా తరపున రామజన్మభూమి న్యాస్‌ను న్యాయపరమైన కోణంలో పరిగణించవచ్చు గాని చట్టపరమైన ప్రతిపత్తితో చూడలేమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలన్నీ నిజమైనప్పటికీ వివాదానికి శాశ్వత పరిష్కారంగా వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలను మొత్తంగా రామ మందిర న్యాస్‌కు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అయిదు మాసాలలో అక్కడ మందిరం కట్టాలని, ఇందు కోసం ఒక ట్రస్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పింది. సున్నీ బోర్డుకు కేంద్రం లేదా రాష్ట్రం అయోధ్య లోనే ప్రముఖమైన చోట అయిదు ఎకరాలు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలన్నారు. ఇది మసీదు కూల్చివేతకు పరిహారంగా భావించాలన్నమాట. కేసులో మూడోవాదిగా వున్న 'నిర్మొహి అఖాడా' స్థూలంగా హిందూ పక్షమైనా ఆలయానికి అనుమతినిస్తే దానికి ఆధ్వర్యం వహించాల్సింది తామేనని చేసిన వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. అఖాడాకు నిర్వహణ పాత్ర మాత్రమే వుందని, వారికి రేపు ఏర్పాటు చేసే ట్రస్టులో ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్దేశించింది. 1045 పేజీలున్న ఈ తీర్పులో ధర్మాసనం విభిన్న కోణాలను సాక్ష్యాలనూ వాదోపవాదాలను తను పాటించిన నిబంధనలను సుదీర్ఘంగా పొందుపర్చింది. 

అలాగే, అయోధ్య విషయం లో రాజీవ్ గాంధీ, పీ వీ నరసింహా రావు లు ప్రధానమంత్రుల హోదాలో పోషించిన పాత్ర, అలాగే- విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ హయాం లో పుట్టిన ఉద్యమ వేడి తీవ్రత లను కూడా ఈ రోజు అందరూ నెమరు వేసుకుంటున్నారు.