త్వరలో రాహుల్ గాంధికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు?

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధికి త్వరలో పార్టీ పగ్గాలు అప్పగించడానికి పార్టీలో సన్నాహాలు మొదలయినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఇదివరకే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టబోతుంటే పార్టీలో నేతలు అభ్యంతరాలు చెప్పినందుకు ఆయన పార్టీ మీద అలిగి విదేశాలకు వెళ్లిపోయారని వార్తలు వచ్చేయి. మళ్ళీ ఇప్పుడు విదేశాలకు ఎందుకు వెళుతున్నారో ఆయన చెప్పకపోయినా బహుశః మళ్ళీ అదే కారణంతో వెళ్లి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన విదేశాలు వెళ్ళగానే ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాకు ఈవిధంగా లీకులు ఇవ్వడంతో ఆ అనుమానాలు నిజమేనని నమ్మవలసివస్తోంది.

 

ఆయన జనవరి 8 తరువాత భారత్ తిరిగి వస్తారని వారు చెపుతున్నారు. ఆయన రాగానే పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంపై తుది నిర్ణయం తీసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు చెపుతున్నారు. ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినందునే ఆయన పార్టీపై అలిగి విదేశాలకు వెళ్లిపోయినపుడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన పార్టీ పగ్గాలు చేపట్టడానికి సుముఖంగానే ఉన్నారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.