లేని పోని చిక్కుల్లో రాహుల్ గాంధీ..

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ లేని పోని చిక్కుల్లో పడుతూనే ఉంటారు. ఏదో చేద్దామనుకుంటారు.. అది కాస్త ఇంకేదో అయి ఆఖరికి విమర్శలు పాలవుతుంటారు. ఇటీవలే పార్లమెంట్ సమావేశంలో నిద్రపోతూ కెమెరా కళ్లకి చిక్కి బుక్కయ్యారు. గుజరాత్ లోని దళితులపై జరిగిన దాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రతిపక్ష, విపక్ష నేతల వాదనలతో దద్దరిల్లిపోతుంటే.. రాహుల్ గాంధీకి జోల పాడినట్టు అనిపించిందేమో చక్కగా నిద్రలోకి జారుకున్నారు. ఇక రాహుల్ గాంధీ చేసిన ఈ పనికి కాంగ్రెస్ నేతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకొని కూర్చున్నారు. అయితే ఓ రెండు రోజులు దానిపై రాహుల్ గాంధీపై సెటైర్లు విసురుకున్నా ఆ తరువాత రాహుల్ గాంధీ ఆ దళిత కుటుంబాలను పరామర్శించి కాస్త కవర్ చేశారు.

 

అయితే ఇప్పుడు విచిత్రంగా ఆ విషయంలో కూడా రాహుల్ గాంధీ వివాదంలో ఇరుక్కున్నారు. గుజరాత్ దళితుల కుటుంబాలను పరామర్సించడానికి వెళ్లిన ఆయన వారి కుటుంబ సభ్యులను హత్తుకుని ఓదార్చారు. అందరితో పాటే అక్కడే ఉన్న రామాబెన్ ముచ్చాదియా (55) అనే మహిళను రాహుల్ ఆలింగనం చేసుకున్నారు. అంతే ఇప్పుడు ఇది పెద్ద వివాదమైంది. ఇంతకీ ఆమె ఎవరూ... ఆమెను ఆలింగనం చేసుకోవడం వల్ల వివాదం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఆమెపై ఆమెపై హ‌త్యాయ‌త్నం, దోపిడీ, బిల్డ‌ర్‌ కు బెదిరింపులు, ప్ర‌భుత్వ అధికారులను విధి నిర్వ‌హించ‌కుండా అడ్డుకోవడం వంటి పలు కేసులు ఉన్నాయి. పోయి పోయి రాహుల్ గాంధీ ఆమెను ఆలింగనం చేసుకున్నారు.

 

ఇక ఈ విషయం తెలిసిన బీజేపీ పార్టీ నేతలు ఊరుకుంటారా. ఎప్పుడు ఛాన్స్ దొరికితే.. అప్పుడు రాహుల్ గాంధీని విమర్శించడానికి రెడీగా ఉంటారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిద్ర పోయినప్పుడు కూడా నిప్పులు చెరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన బీజేపీ.. హంతుకురాలిని హత్తుకుని కౌగిలించుకుంటావా? అని విమర్శలు మొదలుపెట్టింది. ఇక దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీని కవర్ చేసే పనిలో పడ్డారు. ఆమె తప్పుడు పాస్ తో అక్కడికి వచ్చిందని, బాధితురాలిగా భావించి రాహుల్ ఆమెను ఓదార్చారని, ఇలాంటి దిగజారుడు విమర్శలు చేయవద్దని అంటున్నారు. ఇక ఆమె కూడా స్పందించి.. సాటి ద‌ళితురాలిగా చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌ేందుకు వెళ్లాన‌ని తెలిపింది. బాధితులను చూసి క‌ంటనీరు పెట్టుకుంటున్న సమయంలో రాహుల్ ఓదార్చే ప్రయత్నం చేశారని ఆమె తెలిపింది. మరి బుక్కయిన తరువాత ఎంత కవర్ చేసినా ఏం లాభం.. ఇక ముందైనా రాహుల్ గాంధీ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.