తెలంగాణా ప్రజలపై రాహుల్ ప్రభావం చూపగలరా?

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోనున్నారు. మళ్ళీ 25వ తేదీన మరోమారు ప్రచారానికి వస్తారు. ఈ ఎన్నికలలో తెలంగాణాలో అన్ని యంపీ సీట్లు తన ఖాతాలో వేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీమాంధ్రలో పార్టీని, తమ నేతల భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ, కేసీఆర్ మాట తప్పడంతో కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. తెలంగాణాలో అవలీలగా గెలవగల స్థితి నుండి నేడు చెమటోడ్చినా గెలవలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎన్నడూ రాష్ట్రంలో అడుగు పెట్టని జైరామ్ రమేష్ వంటి సీనియర్ నేత, టీ-కాంగ్రెస్ కి అండగా నిలబడి పార్టీ తరపున కేసీఆర్ తో పోరాటం చేయవలసి వస్తోంది. నిజానికి కాంగ్రెస్ లో తెరాస విలీనమయినా లేక ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొన్నా ఇంత ప్రయాసపడవలసిన అవసరముండేదే కాదు. కానీ కేసీఆర్ పదవీ కాంక్ష వలన వాటి మధ్య పొత్తులు పొసగలేదు. అందుకే సోనియా, రాహుల్ గాంధీలు సైతం ఆయనను డ్డీ కొనేందుకు దిగిరావలసి వస్తోంది.

 

ఇక రాహుల్ గాంధీ తన ప్రచారంలో ప్రజలకు ఏమి చెప్పబోతున్నారో తేలికగానే ఊహించవచ్చును. ఆయన కూడా తన తల్లి సోనియాగాంధీ చెప్పినట్లే తెలంగాణా ఏర్పాటులో కేసీఆర్ కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమని, తన తల్లి తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, ఆమె పట్టుదల కారణంగానే తెలంగాణా ఏర్పడిందని చెప్పవచ్చును. అదేవిధంగా తనకు పక్కలో బల్లెంలా తయారయిన నరేంద్ర మోడీపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ, దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్న అటువంటి వ్యక్తితో చంద్రబాబు పొత్తులు పెట్టుకొన్నారని ఆక్షేపించవచ్చును. అయితే తనను ప్రధానిని చేయడం కోసమే బలమయిన ఆంద్ర రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన సంగతి ఆయన అంగీకరించరు.

 

ఈసారి ఎన్నికలలో తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్న కారణంగా ఆయన ఎంత గొప్పగా మాట్లాడినా, అది ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపలేవు. అదే పనిని టీ-కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా చేయగలిగితే మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.