రాహుల్ స్థానంలోకి ప్రియాంకా గాంధీ రాబోతోందా

 

రానున్నఎన్నికల తరువాత యుపీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీకి ప్రధానిగా పట్టభిషేకం చేసి సోనియాగాంధీ రాజకీయాల నుండి తప్పుకోవాలనుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్ల, రానున్న ఎన్నికలు యుపీయేకి చాలా కీలకమయినవి. అయితే రాహుల్ గాంధీ గత తొమ్మిదేళ్లుగా రాజకీయాలలో ఉన్నపటికీ, తనకి అత్యంత అనుకూలమయిన పరిస్థితుల్లో కూడా పార్టీపై కానీ ప్రభుత్వంపై గానీ, చివరికి దేశ రాజకీయాలపై గానీ ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయారు.

 

గత పదేళ్ళలో దేశంలో అనేక సంచలన సంఘటనలు, పరిణామాలు కలిగాయి. కానీ రాహుల్ గాంధీ ఎన్నడూ కూడా చొరవ తీసుకొని తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొనే ప్రయత్నం చేయలేదు. ఆయన ఎల్లపుడూ తనదయిన ఒక ఊహా ప్రపంచంలో విహరిస్తూ, రాజకీయల ప్రక్షాళన, అధికార వికేంద్రీకరణ, నీతి నిజాయితీవంటి అంశాలపై సుదీర్గ ఉపన్యాసాలకే పరిమితమవుతారు.

 

గతంలో తనకి ప్రధాని పదవిపై ఆసక్తిలేదని ప్రకటించిన ఆయన, ఈ మధ్యనే ఉగ్రవాదుల చేతిలో తను కూడా చనిపోవచ్చునని చెప్పి తను ఎంత బలహీనుడో స్వయంగా ఆయనే ప్రకటించుకొన్నారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న బీజేపీ ఇదే అదునుగా రాజకీయంగా మంచి అనుభవశాలి, రాహుల్ గాంధీకి పూర్తి భిన్నమయిన ధోరణితో గొప్ప ఆశావాది అయిన నరేంద్ర మోడీని ముందుకు తీసుకురావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఏమిచేయాలో తెలియని అయోమయంలో పడింది.

 

బొత్తిగా నాయకత్వ లక్షణాలు ప్రదర్శించని, నిరాశావాది అయిన రాహుల్ గాంధీని నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళినట్లయితే నరేంద్ర మోడీ చేతిలో భంగపాటు తప్పదనే చేదునిజం మెలమెల్లగా కాంగ్రెస్ నేతలకు అర్ధం అవుతోంది. అందుకే ఇప్పుడు ప్రియాంకా గాంధీని క్రమంగా ముందుకు తీసుకు వస్తోంది. స్వర్గీయ ఇందిరాగాంధీకి దగ్గర పోలికలున్నందున ఆమెను ప్రజలు ఆమోదించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అభిప్రాయం. అయితే ఆమె తనలో ఇందిరమ్మకున్న నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయని ఆమె నిరూపించుకోవలసి ఉంటుంది.

 

ఒకవేళ రానున్నఎన్నికలలో ప్రియాంకా గాంధీ నేతృత్వంలో యుపీయే కూటమి విజయం సాధిస్తే ఆ విజయం ఆమెకే స్వంతం అవుతుంది గనుక, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెనే ప్రధాని అభ్యర్ధిగా ఎన్నుకోవలసిఉంటుంది. అప్పుడు రాహుల్ పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీయే సమాధానం చెప్పవలసి ఉంటుంది. నవంబర్, డిశంబర్ నెలలో ఐదు రాష్ట్రాలలో జరగనున్న శాసనసభ ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్ అధిష్టానం రాహుల్, ప్రియాంకాల విషయంలో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.