పదవి విషం వంటిది! కానీ పుచ్చుకోక తప్పదు: రాహుల్
posted on Jan 14, 2014 8:20PM
.jpg)
కాంగ్రెస్ అధిష్టానం ప్రధాని మన్మోహన్ సింగ్ చేత వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటన చేయించడం పూర్తయింది. ఇక ఇంతకాలం వైరాగ్యం ప్రదర్శించిన రాహుల్ యువరాజవారు కూడా “క్రమశిక్షణ గల కార్యకర్తగా తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని” పద్ధతి ప్రకారం చెప్పవలసిన ఆ నాలుగు ముక్కలు కూడా చెప్పేసి తన కాంగ్రెస్ భక్త కోటిని సంతోషబెట్టారు. అందువల్ల ఇక యువరాజవారికి శాస్త్రోక్తంగా పట్టాభిషేక మహోత్సవం జరుపవలసి ఉంది. అందుకు (కాంగ్రెస్) పెద్దలు జనవరి17 సుమూహూర్తంగా నిశ్చయించారు. గనుక ఇక సోనియా రాహుల్ నామ స్మరణతోనే జీవితాలను పునీతం చేసుకొంటున్న కాంగ్రెస్ భక్తకోటి, ఆ వేడుకను చూసి తరించేందుకు మరో మూడు యుగాలు (రోజులు) ఓపిక పట్టక తప్పదు.
రాహుల్ గాంధీ తన అంగీకారం తెలిపేటప్పుడు దేశ ప్రజలెవరికీ తెలియని కొన్ని గొప్ప సత్యాలు కూడా తెలియజేసి పుణ్యం కట్టుకొన్నారు. 'తమ వంశంలో ఎవరికీ కూడా అధికార లాలస అనేది లేనేలేదని, కానీ ఏదో అలా జరిగిపోతోంది అంతే'నని శలవిచ్చారు. తనకి కూడా ప్రధాన మంత్రి పదవి విషంతో సమానమని కానీ, అలనాడు ఆ గరళకంటుడు (శివుడు) ప్రజలను రక్షించేందుకు హాలహలం త్రాగినట్లే తాను కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, దేశం కోసం, దేశ ప్రజల కోసం ఈ హాలాహలం (ప్రధాన మంత్రి పదవి)పుచ్చుకొనేందుకు సిద్దపడుతున్నానని శలవిచ్చారు. ఆయన ఈ మాట చెప్పకపోయినా ‘కాంగ్రెస్ అంటేనే త్యాగాల పుట్ట’ అని జనాలందరికీ తెలుసు గనుక తన కోసమే మన్మోహన్ సింగ్ ను బలవంతంగా కుర్చీలో నుండి దింపేసినట్లు ఫీలయిపోతూ ఆయన ఇంతగా సంజాయిషీ ఇవ్వనవసరం లేదు. ప్రజలు ఆ మాత్రం అర్ధం చేసుకోగలరు. ఇక ఇంతకాలం తన ప్రధాని పదవీ వైరాగ్యం చూసి తానేదో అందుకు పనికిరానని ఎవరూ అనుకోవద్దని బీజేపీకి సూచించారు. ఈవిషయం గట్టిగా నొక్కి చెప్పడం మాత్రం చాలా అవసరమే. ఎందుకంటే, ఆయన వైరాగ్యానికి ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా తప్పుగా అర్ధం చేసుకొని ఎవరికీ తోచిన, అనువయిన భాష్యాలు వారు చెప్పుకొంటున్నారు.
ఆయన ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చొనేందుకు ఇప్పటికయినా దైర్యం చేసి ముందుకు రావడమే కాకుండా, అందుకు తను అన్ని విధాల తగిన వాడినని గుండెల మీద చెయ్యి వేసుకొని తనంతట తాను చెప్పుకోవడం చూసి కాంగ్రెస్ జనాల కళ్ళు ఆనందంతో చమర్చిఉంటాయి. అయితే, పట్టాభిషేకం వరకు అంతా కాంగ్రెస్ చేతిలో పనే గనుక ఎటువంటి అవాంతరాలు, అభ్యంతరాలు లేకుండా జరిగిపోవచ్చును. కానీ తన నేతృత్వంలో ఇంతవరకు ఏడు రాష్ట్రాలలో వరుస పరాజయాలు స్వంతం చేసుకొని ఒక అరుదయిన రికార్డు స్వంతం చేసుకొన్నరాహుల్ గాంధీ, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో తన రికార్డులు తానే బ్రద్దలు కొడతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసి తను కూడా ప్రధాని కుర్చీలో పడతారా? అనేది కాంగ్రెస్ పార్టీయే చెప్పాలి.
ఒకవేళ అదృష్టవశాతు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆయన సింహాసనం అధిష్టిస్తే, ఆయన ఎలాగూ ‘కాంగ్రెసేతర అవినీతి’ని కడిగిపారేసేందుకు సంకల్పం చెప్పుకొన్నారు గనుక ఇక దేశానికి మంచి రోజులు వస్తాయని ఎదురుచూడవచ్చును. ఒకవేళ నరేంద్ర మోడీ యువరాజవారి కోసమే కేటాయింపబడ్డ ప్రధాని కుర్చీని కాంగ్రెస్ చేతిలోనుండి బలవంతంగా లాకొంటే, ఆయన కూడా అభివృద్ధి మంత్రం గట్టిగా పటిస్తున్నారు గనుక దేశానికి డోకా ఉండదు. అందువలన కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకున్న ప్రజలందరూ ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని ఎవరి బాషలో వారు హాయిగా పాడుకోవచ్చును.