బోరు బావికి మరో బాలుడు బలి

దేశంలో బోరుబావిలో పడి చిన్నారులు మరణిస్తున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నా.. ప్రభుత్వాలలో కదలిక రావడం లేదు. బోరుబావులను పూడ్చకుండా వదిలేసిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా మధ్య ప్రదేశ్ లో మరో బాలుడు బోరు బావిలో పడి మరణించారు. గత మంగళవారం (డిసెంబర్6) బేతుల్ జిల్లా మాండవి అనే గ్రామంలో ఎనిమిదేళ్ల బాలుడు పూడ్చకుండా వదిలేసిన బోరు బావిలో ప్రమాద వశాత్తూ పడిపోయాడు.

ఈ విషయాన్ని గమనించిన ఆ బాలుడి అక్క వెంటనే  తండ్రికి చెప్పింది. ఆయన అధికారులకు సమాచారం అందించారు. అదికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోరు బావిలో 55 అడుగుల లోతున బాలుడు ఉన్నట్లు గుర్తించిన అధికారులు బోర్ వెల్ లోపల కెమెరాలు అమర్చి బాలుడి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

ఆక్సిజన్ సరఫరా చేశారు. అయితే బోరు బావి ప్రదేశంలో బండరాళ్లు ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమౌతూ వచ్చింది ఎట్టకేలకు బాలుడు బోరు బావిలో పడిన నాలుగు రోజుల తరువాత అంటే శనివారం (ఉదయం) బయటకు తీశారు.  అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి పోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు.