విజయసాయికి ర‌ఘురామ షాక్‌.. బెయిల్‌ రద్దుకు కోర్టులో పిటిషన్‌

ర‌ఘురామ‌ అన్నంత ప‌నీ చేశారు. ఏ1తో పాటు ఏ2 సంగ‌తీ తేలుస్తానంటూ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. అన్న‌ట్టుగానే.. విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేశారు. ఆగ‌స్టు 25న జ‌గ‌న్ కేసులో తుది తీర్పు రాబోతోంది. బెయిల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అయి జైలుకు వెళితే.. ఆ స్థానంలో తాను అధికారం చెలాయించొచ్చ‌ని క‌ల‌లు కంటున్న నెంబ‌ర్ 2కి.. అదే ర‌ఘురామ ఝ‌ల‌క్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ర‌ఘురామ‌ను త‌ట్టుకోవ‌డం సీఎం జ‌గ‌న్ వ‌ల్లే కావ‌డం లేదు.. ఇక త‌న‌వ‌ల్ల ఏం అవుతుంద‌ని తెగ ఇదైపోతున్నార‌ట విజ‌య‌సాయిరెడ్డి.

జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టును కోరారు. ఎంపీగా కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా కలిసే విజయసాయిరెడ్డి.. తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయనే విధంగా చిత్రీకరించి సాక్షుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భయం కలిగిస్తున్నారని పిటిషన్‌లో ప్ర‌స్తావించారు. విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే .. జగన్‌ అక్రమాస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని సీబీఐ జేడీ చేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, ఇది స్వేచ్ఛాయుత విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు.  

విజయనగరం మాన్సాస్‌ ట్రస్ట్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలు చట్టవిరుద్ధమని హైకోర్టు కొట్టివేసిన సందర్భంలో అశోక్‌గజపతిరాజు దొడ్డిదారిన కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఆయన్ను జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం కోర్టు ధిక్కరణే కాకుండా న్యాయవ్యవస్థ పట్ల ఆయన దృక్పథాన్ని తేటతెల్లం చేస్తోందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.