కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. బీజేపీ సెలబ్రేషన్స్.. 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు భారీ షాక్ తగిలింది. అది మరెక్కడో కాదు ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే. కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు  శివప్రసాద్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు జిల్లా కలెక్టర్. తన ఆదేశాలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. సీఎం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు కలెక్టర్ షాక్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సెగ రాజేసిన టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు వివాదంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. వైసీపీ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి షాకిస్తూ..  టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు జిల్లా కలెక్టర్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఆదేశాలకు ఖచ్చితంగా పాటించాలని కూడా కలెక్టర్ స్పష్టం చేశారు. 

ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై కొన్ని రోజులుగా వివాదం సాగుతోంది. విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ కూడా చేశారు. అయితే టిప్పు విగ్రహంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ముఖ్యనేతలు ప్రొద్దుటూరుకు వచ్చి ఆందోళన చేశారు. విగ్రహం ఏర్పాటు కోసం శంఖుస్థాపన చేసిన చోట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ధర్నా నిర్వహించారు. బీజేపీ తీవ్ర అభ్యంతరం చెబుతున్నా వెనక్కి తగ్గలేదు ఎమ్మెల్యే రాచమల్లు. టిప్పు సుల్తాన్ విగ్రహంపై బీజేపీ కావాలనే రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. విగ్రహం  ఏర్పాటు చేసి తీరుతానని చెప్పారు. ఎవరూ అడ్డుకుంటారో చూస్తానంటూ హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యే గట్టి పట్టుదలగా ఉన్నప్పటికి.. విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి నిరాకరించడం సంచలనంగా మారింది. 

కడప జిల్లా కలెక్టర్ ఆదేశాలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంతోషం వ్యక్తం చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుట్రలను ఛేదించామని చెప్పారు. బీజేపీ చేసిన పోరాటాల ఫలితంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేయకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారని వీర్రాజు తెలిపారు, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారన్నారు. ఇది, హిందువులు, బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన గొప్ప విజయమని సోము వీర్రాజు తెలిపారు. దేశంలో నివసించే ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని పాటించాలన్నారు. కాదని రాచమల్లు రాజ్యంగం పాటిస్తామంటే.. ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయని ఎద్దేవా చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే మీద, ఇతరుల మీద పోలీసులు కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.